Dubai: దుబాయ్ డౌన్ టౌన్ పై డ్రోన్ దాడి.. గల్ఫ్ దేశాలపై తాజాగా జరిగిన పలు దాడుల వివరాలు ఇవిగో!
- దుబాయ్ అల్ బదా నివాస ప్రాంతంపై డ్రోన్ దాడి
- క్రీక్ హార్బర్ ప్రాతంలోని ఓ భవనాన్ని ఈ తెల్లవారుజామున ఢీకొన్న మరో డ్రోన్
- రియాద్‌లోని డిప్లొమాటిక్ క్వార్టర్ వైపు వచ్చిన డ్రోన్ ను కూల్చివేసిన సౌదీ బలగాలు
గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులను ఉద్ధృతం చేస్తోంది. తాజాగా, దుబాయ్ సహా పలు గల్ఫ్ నగరాల్లో డ్రోన్ దాడులు, పేలుళ్లు సంభవించాయి. అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ ప్రారంభించిన ఈ ప్రతిదాడులు ఇప్పుడు గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థను, భద్రతను కలవరపెడుతున్నాయి.
తాజా దాడులకు సంబంధించిన కొన్ని వివరాలు:
దుబాయ్ డౌన్ టౌన్ లోని అల్ బదా నివాస ప్రాంతంలో డ్రోన్ పేలుడు జరిగినట్లు అధికారులు ధృవీకరించారు. ఈ దాడితో ఆకాశంలో పొగ మేఘాలు కమ్ముకున్నాయి. అయితే ఈ దాడిలో ఎవరికీ గాయాలు కాలేదని దుబాయ్ మీడియా తెలిపింది.
మరోవైపు దుబాయ్ క్రీక్ హార్బర్ ప్రాంతంలోని ఓ భవనాన్ని ఈ తెల్లవారుజామున ఒక డ్రోన్ ఢీకొట్టింది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. దుబాయ్ తీరంలో ప్రయాణిస్తున్న ఒక కంటైనర్ షిప్ పై గుర్తుతెలియని క్షిపణి దాడి జరగడంతో స్వల్పంగా మంటలు చెలరేగాయి. షిప్పులోని సిబ్బంది అందరూ క్షేమంగా ఉన్నట్లు సమాచారం.
బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని ముహర్రాక్ ద్వీపంపై ఇరాన్ చేసిన దాడితో భారీ మంటలు చెలరేగాయి. జెట్ ఫ్యూయల్ ట్యాంకులు ఉన్న ప్రాంతం కావడంతో ప్రజలంతా కిటికీలు మూసివేసి ఇంట్లోనే ఉండాలని అధికారులు హెచ్చరించారు.
కువైట్ లో ఒక నివాస భవనాన్ని ఇరాన్ డ్రోన్ ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. కువైట్ గగనతలాన్ని ఉల్లంఘించిన మరికొన్ని డ్రోన్లను తమ వైమానిక దళం కూల్చివేసినట్లు కువైట్ రక్షణ శాఖ తెలిపింది.
సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని డిప్లొమాటిక్ క్వార్టర్ (రాయబార కార్యాలయాల ప్రాంతం) లక్ష్యంగా వచ్చిన డ్రోన్‌ను సౌదీ దళాలు కూల్చివేసాయి. అలాగే తూర్పు ప్రాంతంలోని షైబా చమురు క్షేత్రాన్ని లక్ష్యంగా చేసుకున్న మరికొన్ని డ్రోన్లను కూడా కూల్చివేసినట్లు సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.