ఖతార్ నుంచి 1,000 మంది భారతీయులు సురక్షితంగా స్వదేశానికి

Qatar Airways Helps 1000 Indians Return Home Safely
  • పశ్చిమాసియా ఉద్రిక్తతల నడుమ ఖతార్ నుంచి 1000 మంది భారతీయులు స్వదేశానికి
  • ఖతార్ ఎయిర్‌వేస్ విమానాల్లో న్యూఢిల్లీ, ముంబై, కొచ్చి నగరాలకు ప్రయాణికులు
  • సౌదీ అరేబియా మీదుగా వెళ్లేందుకు 96 గంటల తాత్కాలిక ట్రాన్సిట్ వీసాల జారీ
  • సహాయం కోసం 24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన భారత రాయబార కార్యాలయం
పశ్చిమాసియాలో నెలకొన్న భద్రతా పరిస్థితుల నేపథ్యంలో ఖతార్‌లో చిక్కుకుపోయిన సుమారు 1000 మంది భారతీయ ప్రయాణికులు సురక్షితంగా స్వదేశానికి తిరిగి వచ్చారు. వీరిని న్యూఢిల్లీ, ముంబై, కొచ్చి నగరాలకు తరలించినట్లు దోహాలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ప్రయాణికుల తరలింపు ప్రక్రియను సులభతరం చేసేందుకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు స్పష్టం చేసింది.

ఎంబసీ తన అధికారిక ఎక్స్ (ట్విట్ట‌ర్‌) ఖాతాలో పంచుకున్న వివరాల ప్రకారం నిన్న‌ ఖతార్ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానాల్లో ఈ ప్రయాణికులు భారత్‌కు చేరుకున్నారు. చిక్కుకుపోయిన భారతీయుల ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు, ముఖ్యంగా మానవతా దృక్పథంతో అత్యవసర కేసులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు ఖతార్ ఎయిర్‌వేస్‌తో సమన్వయం చేసుకున్నట్లు పేర్కొంది. వారి సహకారానికి ఎంబసీ కృతజ్ఞతలు తెలిపింది. ఇవాళ న్యూఢిల్లీకి మరో విమానం షెడ్యూల్ అయినట్లు కూడా వెల్లడించింది.

విమాన ప్రయాణంతో పాటు రోడ్డు మార్గంలో ప్రయాణించే వారికి కూడా ఎంబసీ సహాయపడుతోంది. సౌదీ అరేబియాలోని సల్వా సరిహద్దు గుండా ప్రయాణించడానికి వీలుగా భారతీయులకు 96 గంటల వ్యాలిడిటీతో తాత్కాలిక ట్రాన్సిట్ వీసాలను జారీ చేస్తున్నట్లు వివరించింది. ఇదే మార్గంలో, ఖతార్‌లో చిక్కుకుపోయిన భారత బాస్కెట్‌బాల్ జట్టు కూడా సౌదీ అరేబియా నుంచి విమానాల్లో స్వదేశానికి చేరుకుందని తెలిపింది. ఈ విషయంలో సహకరించిన సౌదీ అరేబియా, ఖతార్ అధికారులకు ఎంబసీ ధన్యవాదాలు తెలియజేసింది. సహాయం కోసం ఎంబసీలో 24/7 కంట్రోల్ రూమ్ పనిచేస్తోందని, దీంతో పాటు భారతీయ కమ్యూనిటీ సంస్థలైన ఐసీసీ, ఐసీబీఎఫ్‌కు చెందిన హెల్ప్‌లైన్‌లు కూడా అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేసింది.

ఇదిలా ఉంటే.. బహ్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం నిన్న‌ ఒక కీలక ప్రకటన జారీ చేసింది. పొరుగు దేశాలకు ప్రయాణ ఏర్పాట్లు చేస్తున్నట్లు కొన్ని ప్రైవేట్ వ్యాపార బృందాలు చేస్తున్న ప్రచారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ప్రైవేట్ పార్టీలు చేసే రవాణా ఏర్పాట్లకు ఎంబసీ బాధ్యత వహించదని, ఈ విషయాన్ని అందరూ గమనించాలని సూచించింది.
Go Back to Shorts
Repatriation
Qatar Airways
Indian Embassy Doha
Indians in Qatar
Doha
Bahrain Embassy
Saudi Arabia
Transit Visa
Operation Ajay

More Telugu News