మధ్య ప్రాచ్యంలో ముదురుతున్న యుద్ధం: బాగ్దాద్‌ విమానాశ్రయంపై డ్రోన్‌ దాడి

Baghdad Airport Drone Attack Deepens Middle East War
  • అమెరికా దౌత్య కార్యాలయంపై విరుచుకుపడ్డ ఆరు డ్రోన్లు
  • ఐదింటిని కూల్చివేసిన రక్షణ దళాలు 
  • మధ్య ఇజ్రాయెల్‌, బహ్రెయిన్‌లపై ఇరాన్‌ క్షిపణుల వర్షం
  • హార్ముజ్ జలసంధిలో 16 ఇరాన్ మైన్ లేయర్ల ధ్వంసం
ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ కూటమి మధ్య యుద్ధం 12వ రోజుకు చేరుకుంది. బుధవారం తెల్లవారుజామున ఇరాక్ రాజధాని బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని అమెరికా దౌత్య మద్దతు కేంద్రం (BDSC)పై డ్రోన్ల దాడి జరిగింది. మొత్తం ఆరు డ్రోన్లు ఈ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకోగా, ఐదింటిని అమెరికా రక్షణ వ్యవస్థలు గాలిలోనే కూల్చివేశాయి. అయితే, ఒక డ్రోన్ మాత్రం కార్యాలయ ప్రాంగణాన్ని తాకడంతో స్వల్ప నష్టం వాటిల్లింది. ఈ దాడిలో ఎవరికీ గాయాలు కాలేదని ప్రాథమిక సమాచారం.

బుధవారం సూర్యోదయానికి ముందే ఇరాన్ తన క్షిపణి ఛత్రాన్ని విప్పింది. ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్, హైఫా నగరాలను లక్ష్యంగా చేసుకుని భారీగా క్షిపణులను ప్రయోగించింది. అలాగే, బహ్రెయిన్‌లోని అమెరికా ఐదో నావికా దళానికి చెందిన స్థావరంపై కూడా ఇరాన్ దాడులు చేసినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. దీనికి ప్రతిగా అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్ అంతటా భీకరమైన వైమానిక దాడులను కొనసాగిస్తున్నాయి.

యుద్ధం ఆపకపోతే గల్ఫ్ నుంచి ప్రపంచ దేశాలకు వెళ్లే చమురు రవాణాను పూర్తిగా అడ్డుకుంటామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) హెచ్చరించింది. హార్ముజ్ జలసంధిలో మైన్లను (మందుపాతరలు) అమర్చి షిప్పింగ్‌ను నిలిపివేసేందుకు ఇరాన్ యత్నిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో స్పందించారు. ఒకవేళ చమురు సరఫరాను ఇరాన్ అడ్డుకుంటే, ఎన్నడూ చూడని రీతిలో ప్రతీకారం ఉంటుందని హెచ్చరించారు.

చమురు మార్గంలో మైన్లను అమర్చేందుకు సిద్ధంగా ఉన్న ఇరాన్‌కు చెందిన 16 నౌకలను అమెరికా నావికా దళం ఇప్పటికే ధ్వంసం చేసింది. ఇంధన సరఫరాకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ'లో భాగంగా అమెరికా ఈ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు గరిష్ఠ స్థాయికి చేరడంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి.
Go Back to Shorts
Baghdad Airport
Iran
America
Israel
Drone Attack
Middle East Conflict
Oil Transportation
Hormuz Strait
Donald Trump
IRGC

More Telugu News