Sanju Samson: అయ్యో, శాంసన్... ఫైనల్లో సెంచరీ మిస్!

Sanju Samson Misses Century in Final T20 World Cup Match
  • అహ్మదాబాద్ వేదికగా భారత బ్యాటర్ల వీరవిహారం
  • న్యూజిలాండ్‌ బౌలర్లపై విరుచుకుపడ్డ సంజూ శాంసన్
  • అర్ధసెంచరీలతో మెరిసిన అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్
  • ఒకే ఓవర్లో 3 వికెట్లు తీసిన నీషామ్
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ తుది పోరులో భారత జట్టు పరుగుల వరద పారిస్తోంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ నిర్ణయం సరైనది కాదని నిరూపిస్తూ.. భారత టాప్ ఆర్డర్ కివీస్ బౌలర్లను ఉతికారేసింది. కేవలం 16 ఓవర్లు ముగిసేసరికి భారత్ 4 వికెట్ల నష్టానికి 204 పరుగుల భారీ స్కోరు సాధించింది.

ముఖ్యంగా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఫైనల్ మ్యాచ్ అనే ఒత్తిడిని దరిచేరనీయకుండా, క్రీజులోకి వచ్చినప్పటి నుంచి బౌండరీల మోత మోగించాడు. కేవలం 46 బంతులు ఎదుర్కున్న సంజూ.. 5 ఫోర్లు, ఏకంగా 8 భారీ సిక్సర్లతో 89 పరుగులు సాధించి ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచాడు. అయితే సెంచరీకి చేరువలో జేమ్స్ నీషమ్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. సంజూ ఇన్నింగ్స్ భారత జట్టును పటిష్ట స్థితిలో నిలబెట్టింది. సంజూ స్ట్రైక్ రేట్ ఏకంగా 193.48 ఉండటం గమనార్హం.

అంతకుముందు, మరో ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభించాడు. కేవలం 21 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 52 పరుగులు చేసి మెరుపు వేగంతో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 7.1 ఓవర్లలోనే 98 పరుగులు జోడించారు. ఆ తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ కూడా తగ్గేదేలే అన్నట్లుగా బ్యాటింగ్ చేశాడు. 25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 54 పరుగులు చేసి, సంజూతో కలిసి రెండో వికెట్‌కు 105 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

అయితే, 16వ ఓవర్ వేసిన జేమ్స్ నీషమ్ మ్యాచ్ గతిని మార్చే ప్రయత్నం చేశాడు. ఒకే ఓవర్లో సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్‌లను అవుట్ చేసి భారత శిబిరాన్ని దిగ్బ్రాంతికి గురిచేశాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ డకౌట్‌గా వెనుదిరగడం నిరాశపరిచింది. ఈ ఓవర్ తర్వాత టీమిండియా స్కోరు నిదానించింవది.

ఇన్నింగ్స్ ముగియడానికి ఇంకా 4 ఓవర్ల ఆట మిగిలి ఉంది. క్రీజులో హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ ఉన్నారు. ఇప్పటికే స్కోరు 204 దాటడంతో, చివరి ఓవర్లలో భారత బ్యాటర్లు ఇదే జోరు కొనసాగిస్తే టీమిండియా స్కోరు 240 నుంచి 250 పరుగుల వరకు వెళ్లే అవకాశం ఉంది. కివీస్ బౌలర్లలో నీషమ్ 3 వికెట్లు పడగొట్టగా, మిగిలిన బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఫైనల్ పోరులో భారత్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించే దిశగా దూసుకుపోతోంది.
Sanju Samson
T20 World Cup 2026
India vs New Zealand
Narendra Modi Stadium
Abhishek Sharma
Ishan Kishan
James Neesham
Cricket Final
Century Missed
Hardik Pandya

More Telugu News