Rob Walter: భారత్ ఫేవరెట్ కావొచ్చు... కానీ ట్రోఫీ గెలుస్తుందని గ్యారెంటీ లేదు: న్యూజిలాండ్ కోచ్

Rob Walter Comments on T20 World Cup Final India vs New Zealand
  • అండర్‌డాగ్స్‌గా బరిలో దిగడం తమకు అలవాటేనన్న రాబ్ వాల్టర్
  • వనరులు తక్కువే అయినా.. సమష్టి కృషే తమ ఆయుధం అని ధీమా
  • దక్షిణాఫ్రికాపై గెలుపే తమ సామర్థ్యానికి నిదర్శనమని స్పష్టీకరణ
  • కెప్టెన్ శాంట్నర్ నాయకత్వంపై ప్రశంసలు
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నేడు (ఆదివారం) జరగనున్న టీ20 ప్రపంచకప్ ఫైనల్ సమరానికి రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ హెడ్ కోచ్ రాబ్ వాల్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మెగా ఫైనల్లో టీమిండియానే ఫేవరెట్ అని అంగీకరించిన వాల్టర్.. అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగడం, సవాళ్లను ఎదుర్కోవడం తమకు అలవాటేనని స్పష్టం చేశారు.

ఫైనల్ మ్యాచ్‌కి ముందు మీడియాతో మాట్లాడిన వాల్టర్.. "నిజాయతీగా చెప్పాలంటే మమ్మల్ని అండర్‌డాగ్స్‌గా ముద్ర వేయడం కొత్తేమీ కాదు. భారత్‌తో పోలిస్తే మా దగ్గర ఆర్థిక వనరులు, ఆటగాళ్ల సంఖ్య తక్కువే ఉండొచ్చు. దాదాపు ప్రతి విషయంలోనూ భారత్ మాకంటే మెరుగ్గా ఉంది. కానీ మైదానంలో సమిష్టిగా రాణించడమే మా బలం. ఈ టోర్నీలో వేర్వేరు సందర్భాల్లో వేర్వేరు ఆటగాళ్లు బాధ్యత తీసుకొని జట్టును గెలిపించారు" అని పేర్కొన్నాడు.

భారత్ ఫేవరెట్‌గా ఉన్నంత మాత్రాన ట్రోఫీ వాళ్లకే దక్కుతుందని కాదని, ఫైనల్ వంటి పెద్ద సందర్భాల్లో మైదానంలో ఏదైనా జరగవచ్చని అభిప్రాయపడ్డాడు. క్రీడల్లో ఉన్న మజానే అది అని వ్యాఖ్యానించాడు. ఇటీవల దక్షిణాఫ్రికాపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి తమ సత్తా ఏంటో నిరూపించుకున్నామని, తాము సమష్టిగా రాణిస్తే ప్రపంచంలో ఎవరినైనా ఓడించగలమని ధీమా వ్యక్తం చేశాడు.

ఇక కివీస్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్‌పై కోచ్ ప్రశంసల జల్లు కురిపించాడు. శాంట్నర్ చాలా కూల్ అని, కొన్నిసార్లు అతడి విలువను తక్కువగా అంచనా వేస్తారని అన్నాడు. మైదానంలో అతడు ప్రశాంతంగా ఉండే తీరు జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపాడు. అతడి నాయకత్వ లక్షణాలను, నైపుణ్యాన్ని ఆటగాళ్లందరూ గౌరవిస్తారని.. నేటి ఫైనల్లో శాంట్నర్ సారథ్యం జట్టుకు ఎంతో మేలు చేస్తుందని వాల్టర్ చెప్పుకొచ్చాడు.


Rob Walter
New Zealand cricket
T20 World Cup Final
India vs New Zealand
Mitchell Santner
Cricket Coach Interview
Underdogs Cricket
Narendra Modi Stadium
Ahmedabad

More Telugu News