Perni Nani: చంద్రబాబు అసెంబ్లీలో తప్పుడు లెక్కలు చెప్పారు: పేర్ని నాని ధ్వజం
- అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ గణాంకాలపై పేర్ని నాని విమర్శలు
- కార్పొరేషన్ల ద్వారా పొందుతున్న రుణాలను దాచిపెట్టారని ఆరోపణ
- గీతం యూనివర్శిటీ ఆక్రమించిన భూములను క్రమబద్ధీకరిస్తున్నారన్న నాని
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన గణాంకాలు, బడ్జెట్ వివరాలపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సభ సాక్షిగా అప్పుల విషయంలో తప్పుడు లెక్కలు చెప్పారని ఆయన ఆరోపించారు. గతేడాది సుమారు రూ. 1.03 లక్షల కోట్ల అప్పు చేసిన ప్రభుత్వం, ఈ ఏడాది రూ. 97 వేల కోట్లు తీసుకుంటామని బడ్జెట్‌లో పేర్కొన్నప్పటికీ, కార్పొరేషన్ల ద్వారా పొందుతున్న రుణాలను మాత్రం దాచిపెడుతోందని విమర్శించారు. కేవలం రెండు నెలల్లోనే రూ. 57 వేల కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం చెప్పడం వాస్తవానికి విరుద్ధమని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి నివసిస్తున్న కరకట్ట నివాసం యాజమాన్యంపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలని నాని డిమాండ్ చేశారు. అది లింగమనేని రమేశ్ దా? సీఆర్డీయేదా? లేక చంద్రబాబుదా? అన్నది వెల్లడించాలని ప్రశ్నించారు. అలాగే విశాఖలోని గీతం యూనివర్సిటీ ఆక్రమించిన వేల కోట్ల విలువైన భూములను ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా క్రమబద్ధీకరిస్తోందని ఆరోపించారు.
తిరుమల లడ్డూ వివాదంపై స్పందిస్తూ, ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని పేర్ని నాని విమర్శించారు. గతంలో జంతువుల కొవ్వు కలిపారని ఆరోపించిన పవన్ కల్యాణ్, ఇప్పుడు అసెంబ్లీలో ఆ మాట మార్చారని ఎద్దేవా చేశారు. హెరిటేజ్ సంస్థ ద్వారా నెయ్యి సరఫరా జరిగిన అంశంపై చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. వీటికి తోడు రైతులకు రుణమాఫీ, సూపర్ సిక్స్ హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని, గతంలో తాము నిర్మించిన ఇళ్లనే ఇప్పుడు కొత్తగా ప్రారంభించబోతున్నారని ఆయన దుయ్యబట్టారు.