Pawan Kalyan: జగన్ హయాంలో ఆర్థిక విధ్వంసం వల్ల రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లింది: పవన్ కల్యాణ్

Pawan Kalyan Andhra Pradesh Set Back 30 Years Under Jagan Rule
  • అసెంబ్లీలో బడ్జెట్, ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ
  • తాజా బడ్జెట్ 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్షలకు ప్రతిరూపమన్న పవన్
  • వైసీపీ హయాంలో విద్యుత్ సంస్థలు రూ. 1.29 లక్షల కోట్ల నష్టాల్లో కూరుకుపోయాయని వెల్లడి

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో బడ్జెట్, ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రసంగిస్తూ గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ పాలనలో జరిగిన 'ఆర్థిక విధ్వంసం' కారణంగా రాష్ట్రం దాదాపు 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన రూ.3.32 లక్షల కోట్ల బడ్జెట్, ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్షలకు ప్రతిరూపమని ఆయన కొనియాడారు. ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, సామాజిక భద్రతా పెన్షన్ల కోసమే రూ. 33 వేల కోట్లు కేటాయించడం సీఎం చంద్రబాబు సాహసోపేతమైన నిర్ణయమని ప్రశంసించారు.


గత ప్రభుత్వ హయాంలో అనాలోచిత విద్యుత్ కొనుగోళ్ల వల్ల డిస్కంలకు రూ. 12,250 కోట్ల నష్టం వాటిల్లిందని, విద్యుత్ సంస్థలు రూ. 1.29 లక్షల కోట్ల నష్టాల్లో కూరుకుపోయాయని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 'ట్రూడౌన్' పేరిట ఛార్జీలు తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించామని పవన్ చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం రూ. 9 లక్షల కోట్ల అప్పులను, రూ. 35 వేల కోట్ల పెండింగ్ బిల్లులను వదిలి వెళ్లిందని విమర్శించారు. ఇందులో ఇప్పటికే రూ. 25 వేల కోట్ల బకాయిలను తమ ప్రభుత్వం చెల్లించిందని స్పష్టం చేశారు.


గత ప్రభుత్వం రాష్ట్ర వాటా నిధులు ఇవ్వకపోవడం వల్ల రూ. 8,700 కోట్ల కేంద్ర నిధులు నిరుపయోగమయ్యాయని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం రూ. 7 వేల కోట్లు కేటాయించి ఇంటింటికీ మంచినీరు అందించే ప్రాజెక్టును వేగవంతం చేస్తోందని వివరించారు. "నేను నాటిన చెట్ల ఫలాలు నా కోసం కాదు.. భావితరాల కోసం" అన్న రవీంద్రనాథ్ ఠాగూర్ సూక్తిని ఉటంకిస్తూ, బడ్జెట్‌లో భావితరాల బాగు కోసం సీఎం చంద్రబాబు మంచి నిర్ణయాలు తీసుకున్నారని కొనియాడారు.

Pawan Kalyan
Andhra Pradesh
AP Budget 2024
Chandrababu Naidu
Jagan Mohan Reddy
Economic Crisis
YSRCP Government
Telugu Desam Party
Financial Loss
State Finances

More Telugu News