Jagan Mohan Reddy: గల్ఫ్‌ దేశాల్లో చిక్కుకున్న ప్రవాసాంధ్రులను సురక్షితంగా తీసుకురావాలి: జగన్‌

Jagan Urges Government to Bring Back Stranded NRIs from Gulf
  • యుద్ధ వాతావరణం కారణంగా వేలాది మంది ఆందోళన
  • విమాన సర్వీసుల రద్దుతో ఎక్కడికక్కడ నిలిచిపోయిన ప్రయాణికులు
  • కేంద్రంతో సమన్వయం చేసుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచన
  • బాధితుల కోసం కంట్రోల్ రూమ్, హెల్ప్‌లైన్ నెంబర్లు ఏర్పాటు చేయాలి
మధ్య ప్రాచ్య దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన ప్రవాసాంధ్రులను తక్షణమే సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావాలని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వాన్ని కోరారు. గల్ఫ్ దేశాల్లో ఏపీకి చెందిన వేలాది మంది ఉపాధి పొందుతున్నారని, ప్రస్తుతం అక్కడ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల వారి భద్రత ప్రశ్నార్థకంగా మారిందని తెలిపారు.

అక్కడ అనిశ్చితి నెలకొనడంతో పాటు పలు విమానాశ్రయాల్లో ఆంక్షలు, విమాన సర్వీసుల రద్దు కారణంగా చాలామంది ఎక్కడికక్కడ చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జగన్ పేర్కొన్నారు. ఈ క్లిష్ట సమయంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి, కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. గల్ఫ్ దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలతో సంప్రదింపులు జరిపి, ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా తెలుగు వారందరినీ వెనక్కి రప్పించేందుకు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే, అక్కడి వారి పరిస్థితిని ఎప్పటికప్పుడు వారి కుటుంబ సభ్యులకు తెలియజేసేందుకు రాష్ట్రంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, హెల్ప్‌లైన్ నెంబర్లను అందుబాటులోకి తేవాలని సూచించారు. ప్రవాసాంధ్రుల భద్రత, వారి సురక్షిత ప్రయాణం ప్రభుత్వ బాధ్యతని, ఈ సంక్షోభ సమయంలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించి సత్వరమే చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Jagan Mohan Reddy
AP Government
Gulf countries
NRI
Andhra Pradesh
Stranded Indians
Middle East crisis
Repatriation
Indian Embassy
Help Line

More Telugu News