Jammu Kashmir: రంజీ ట్రోఫీలో కొత్త ఛాంపియన్.. చరిత్ర సృష్టించిన జమ్మూ కశ్మీర్

Jammu Kashmir Creates History Winning First Ranji Trophy
  • తొలిసారి రంజీ ట్రోఫీ విజేతగా అవతరించిన జమ్మూ కశ్మీర్
  • ఫైనల్లో కర్ణాటకపై తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో చారిత్రక గెలుపు
  • తొలి ఇన్నింగ్స్‌లో శుభమ్ పుండిర్, రెండో ఇన్నింగ్స్‌లో కమ్రాన్, లోత్రా సెంచరీలు
  • ఐదు వికెట్లతో చెలరేగిన అకిబ్ నబీ
  • 67 ఏళ్ల టోర్నీ చరిత్రలో జమ్మూ కశ్మీర్‌కు ఇదే తొలి టైటిల్
భారత దేశవాళీ క్రికెట్‌లో జమ్మూ కశ్మీర్ సరికొత్త చరిత్ర సృష్టించింది. 67 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ తొలిసారి రంజీ ట్రోఫీని ముద్దాడింది. హుబ్లీ వేదికగా ముగిసిన ఫైనల్లో 8 సార్లు ఛాంపియన్ అయిన కర్ణాటకతో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. అయితే, కీలకమైన తొలి ఇన్నింగ్స్‌లో సాధించిన 291 పరుగుల భారీ ఆధిక్యంతో జమ్మూ కశ్మీర్ విజేతగా నిలిచింది. ఈ చారిత్రక గెలుపుతో జట్టు సభ్యులు, అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న జమ్మూ కశ్మీర్.. అద్భుతమైన ప్రదర్శన చేసింది. శుభమ్ పుండిర్ (117) రంజీ ఫైనల్లో సెంచరీ చేసిన తొలి కశ్మీర్ బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. అతనికి యావర్ హసన్ (88), కనిష్క వధావన్ (70), సాహిల్ లోత్రా (72) వంటి ఆటగాళ్లు తోడవడంతో జమ్మూ కశ్మీర్ తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 584 పరుగుల భారీ స్కోరు సాధించింది. కర్ణాటక బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ ఐదు వికెట్లు తీసినప్పటికీ, కశ్మీర్ బ్యాటర్లను కట్టడి చేయలేకపోయాడు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కర్ణాటకను జమ్మూ కశ్మీర్ బౌలర్లు వణికించారు. ముఖ్యంగా అకిబ్ నబీ దార్ (5/54) నిప్పులు చెరిగే బంతులతో ఐదు వికెట్లు పడగొట్టి కర్ణాటక పతనాన్ని శాసించాడు. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (160) ఒంటరి పోరాటం చేసినా మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో కర్ణాటక 293 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో జమ్మూ కశ్మీర్‌కు నిర్ణయాత్మకమైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.

ఇక, రెండో ఇన్నింగ్స్‌లోనూ జమ్మూ కశ్మీర్ బ్యాటర్లు ఆధిపత్యం ప్రదర్శించారు. ఓపెనర్ కమ్రాన్ ఇక్బాల్ (160 నాటౌట్‌), సాహిల్ లోత్రా (101 నాటౌట్‌) అజేయ సెంచరీలతో కర్ణాటక ఆశలపై పూర్తిగా నీళ్లు చల్లారు. జమ్మూ కశ్మీర్ 342/4 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడంతో నిబంధనల ప్రకారం మ్యాచ్ డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో జమ్మూ కశ్మీర్ విజేతగా నిలిచింది. తమ తొలి ఫైనల్ ఆడుతున్నప్పటికీ ఎక్కడా ఒత్తిడికి గురికాకుండా సమష్టిగా రాణించి చారిత్రక విజయాన్ని అందుకుంది.
Jammu Kashmir
Ranji Trophy
Ranji Trophy Winner
Karnataka
Shubham Pundir
Aqib Nabi Dar
Mayank Agarwal
Indian Domestic Cricket
Cricket
Yawar Hasan

More Telugu News