లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్, సిసోడియాలకు ఢిల్లీ కోర్టు క్లీన్ చిట్... హైకోర్టులో తేల్చుకోవాలని సీబీఐ నిర్ణయం

Arvind Kejriwal Cleared in Liquor Scam Case CBI to Appeal
ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన అవినీతి కేసులో ఆప్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలకు భారీ ఊరట లభించింది. ఈ కేసులో వారిపై మోపిన అభియోగాలను కొట్టివేస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు శుక్రవారం వారిని నిర్దోషులుగా ప్రకటించింది. అయితే, ఈ తీర్పు వెలువడిన కొద్దిసేపటికే, దీనిని హైకోర్టులో సవాలు చేయనున్నట్లు సీబీఐ స్పష్టం చేసింది.

కేసు విచారణలో నిందితులపై నేరారోపణలు రుజువు చేసేందుకు తగిన ఆధారాలు లభించలేదని కోర్టు తన తీర్పులో పేర్కొంది. క్రిమినల్ కుట్ర సహా ఎలాంటి నేరపూరిత చర్యలు జరిగినట్లు ఆధారాలు లేవని తేల్చిచెబుతూ, నిందితుల డిశ్చార్జ్ పిటిషన్‌ను న్యాయస్థానం అనుమతించింది.

కోర్టు తీర్పు అనంతరం కేజ్రీవాల్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. సిసోడియా ఆయనను ఓదార్చారు. "సత్యమే గెలుస్తుందని, న్యాయవ్యవస్థపై మాకు పూర్తి నమ్మకం ఉందని ఎప్పుడూ చెబుతున్నాం. ఆ నమ్మకమే ఈ రోజు నిజమైంది" అని కేజ్రీవాల్ అన్నారు. ఆప్‌ను బలహీనపరిచేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా భారీ రాజకీయ కుట్ర పన్నారని, ఇది పూర్తిగా బూటకపు కేసు అని ఆయన ఆరోపించారు.

మరోవైపు, ట్రయల్ కోర్టు తమ విచారణలోని అనేక కీలక అంశాలను విస్మరించిందని లేదా సరిగా పరిగణనలోకి తీసుకోలేదని సీబీఐ వాదిస్తోంది. అందుకే ఈ తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేయనున్నట్లు తెలిపింది. 2021-22 ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, అమలులో అక్రమాలు జరిగాయని, లైసెన్సులకు అనుకూలంగా 'సౌత్ గ్రూప్' నుంచి ఆప్ నేతలు ముడుపులు స్వీకరించారని ఆరోపిస్తూ 2022లో సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
Go Back to Shorts
Arvind Kejriwal
Delhi liquor scam
Manish Sisodia
CBI
Delhi excise policy
Rouse Avenue Court
Aam Aadmi Party
corruption case
high court appeal

More Telugu News