Kumar Sangakkara: టీ20 వరల్డ్ కప్ నుంచి శ్రీలంక నిష్క్రమణ.. సంగక్కర కీలక వ్యాఖ్యలు

Kumar Sangakkara Comments on Sri Lanka T20 World Cup Exit
  • ప్రపంచ క్రికెట్ శరవేగంగా అభివృద్ది చెందుతోందన్న సంగక్కర 
  • శ్రీలంక మాత్రం పాత పద్ధతులనే పట్టుకుని వేలాడుతోందని వ్యాఖ్య
  • మారకపోతే శ్రీలంక వెనుకపడిపోతుందని హెచ్చరిక

సహ ఆతిథ్య దేశంగా బరిలోకి దిగి, సొంత ప్రేక్షకుల మధ్య ప్రపంచకప్‌ను ముద్దాడాలని ఆశించిన శ్రీలంకకు కోలుకోలేని దెబ్బ తగిలింది. కొలంబో వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన కీలక పోరులో 61 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలై, టీ20 వరల్డ్ కప్ 2026 నుంచి లంక నిష్క్రమించింది. ఈ ఓటమితో కేవలం ఒక టోర్నమెంట్ నుంచి వైదొలగడం మాత్రమే కాదని, లంక క్రికెట్ మనుగడకే ప్రమాదమని మాజీ కెప్టెన్ కుమార సంగక్కర హెచ్చరించాడు.


ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో కివీస్ జట్టుపై 84 పరుగులకే 6 వికెట్లు పడగొట్టి ఆధిపత్యం ప్రదర్శించిన లంక, ఆపై పట్టు కోల్పోయింది. మిచెల్ శాంట్నర్, కోల్ మెక్‌కోంచీ జోడీ ఇన్నింగ్స్‌ను నిలబెట్టగా.. ఆపై రచిన్ రవీంద్ర తన స్పిన్ మాయాజాలంతో (4/27) లంక బ్యాటింగ్ వెన్ను విరిచాడు. 169 పరుగుల లక్ష్య ఛేదనలో లంక మిడిల్ ఆర్డర్ పేకమేడలా కూలిపోవడంతో అభిమానుల ఆశలు అడియాశలయ్యాయి. ఈ పరాభవంపై ఎక్స్ వేదికగా స్పందించిన సంగక్కర.. అభిమానుల ఆగ్రహాన్ని, ఆటగాళ్ల వేదనను అర్థం చేసుకోగలనని తెలిపాడు.


అయితే, కేవలం ఈ ఒక్క మ్యాచ్ ఓటమి గురించి కాకుండా, లంక క్రికెట్ వ్యవస్థలోని లోపాలపై సంగక్కర నిశిత విమర్శలు చేశాడు. "ప్రపంచ క్రికెట్ శరవేగంగా అభివృద్ధి చెందుతుంటే, మనం మాత్రం పాత పద్ధతులనే పట్టుకుని వేలాడుతున్నాం. ఫలితాల్లో మార్పు కోరుకుంటూ అవే తప్పులను పదే పదే చేయడం వల్ల ప్రయోజనం లేదు" అని పేర్కొన్నాడు. మనం మారకపోతే అంతర్జాతీయ క్రికెట్‌లో శ్రీలంక వెనుకపడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించాడు. గ్రౌండ్ లోపల, బయట అన్ని స్థాయుల్లో తక్షణమే 'కోర్సు కరెక్షన్' జరగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశాడు.

Kumar Sangakkara
Sri Lanka
T20 World Cup
Sri Lanka Cricket
New Zealand
Rachin Ravindra
Cricket
T20 World Cup 2026
Sports

More Telugu News