‘డొనాల్డ్ డాష్’ ఎఫెక్ట్.. రికార్డు స్థాయిలో దేశం వీడుతున్న అమెరికన్లు

Record Numbers of Americans Leaving US The Donald Dash Effect
అవకాశాల స్వర్గధామంగా పేరుగాంచిన అమెరికాలో అరుదైన పరిణామం చోటుచేసుకుంటోంది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా అమెరికన్లు తమ దేశాన్ని విడిచి ఇతర దేశాలకు వలస వెళ్తున్నారు. దాదాపు 90 ఏళ్ల క్రితం మహా మాంద్యం (Great Depression) సమయంలో కనిపించిన ఈ పరిస్థితి ఇప్పుడు పునరావృతమవుతోందని ప్రముఖ ఆర్థిక పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ తన కథనంలో వెల్లడించింది.

బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూషన్ అంచనాల ప్రకారం 2025లో అమెరికా నుంచి వెళ్లిన వారి సంఖ్య వచ్చిన వారి కన్నా ఎక్కువగా ఉంది. దీంతో వలసల్లో సుమారు 1,50,000 మందికి నికర నష్టం వాటిల్లింది. 2023లో దాదాపు 60 లక్షల మంది అమెరికాకు వలస రాగా, 2025 నాటికి ఆ సంఖ్య 27 లక్షలకు పడిపోయింది. మరోవైపు, కేవలం 15 దేశాల పాక్షిక సమాచారం ప్రకారమే గత ఏడాది 1,80,000 మంది అమెరికన్లు ఆ దేశాలకు వలస వెళ్లినట్లు తెలుస్తోంది.

ఈ వలసల వెల్లువకు ‘డొనాల్డ్ డాష్’ అని కొందరు పేరు పెట్టినా, దీనికి అనేక ఇతర కారణాలు కూడా ఉన్నాయి. అమెరికాలో విపరీతంగా పెరిగిన జీవన వ్యయం, రిమోట్ వర్క్ చేసే సౌలభ్యం, యూరప్ వంటి దేశాల్లో మెరుగైన జీవన ప్రమాణాలు, భద్రత వంటివి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. "అమెరికాలో జీతాలు ఎక్కువైనా, యూరప్‌లో జీవన నాణ్యత బాగుంది. ఇక్కడ ఐదేళ్ల పిల్లలను స్కూల్‌కు పంపితే యాక్టివ్ షూటర్ డ్రిల్స్ చేయాల్సి వస్తుందేమోనన్న భయం లేదు" అని జర్మనీకి వలస వెళ్లిన ఒక అమెరికన్ చెప్పడం అక్కడి సామాజిక ఆందోళనను స్పష్టం చేస్తోంది.

ఒకప్పుడు సాహసవంతులు, ఉన్నత విద్యావంతులు మాత్రమే దేశం విడిచి వెళ్లేవారని, ఇప్పుడు సాధారణ మధ్యతరగతి ప్రజలు, కుటుంబాలు కూడా వలసపోతున్నాయని రిలొకేషన్ సంస్థలు చెబుతున్నాయి. పోర్చుగల్‌లో అమెరికన్ల సంఖ్య 500 శాతం పెరగ్గా, ఐర్లాండ్‌లో గతేడాది రెట్టింపు అయింది. అమెరికా పౌరసత్వం వదులుకోవడానికి కూడా దరఖాస్తులు పెరుగుతున్నాయి.

అయితే, ఈ వలసలపై వైట్ హౌస్ భిన్నంగా స్పందించింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇతర అభివృద్ధి చెందిన దేశాల కన్నా మెరుగ్గా ఉందని, లక్షలాది అక్రమ వలసదారులను వెనక్కి పంపుతూ, అదే సమయంలో అత్యంత సంపన్నులను ‘గోల్డ్ కార్డ్’ వంటి పథకాలతో ఆకర్షిస్తున్నామని తెలిపింది. 1935లో ఉపాధి కోసం అమెరికన్లు సోవియట్ యూనియన్‌కు వెళ్లిన తర్వాత మళ్లీ ఇప్పుడు అమెరికా నుంచి నికర వలసలు నమోదు కావడం గమనార్హం.
Go Back to Shorts
American Exodus
United States
Great Depression
US Migration
Donald Dash
Cost of Living
Remote Work
Europe Living
White House
Gold Card

More Telugu News