Mamata Banerjee: మమతా బెనర్జీ నాయకత్వంతోనే ఇండియా కూటమికి మనుగడ

Aiyar says Mamata Banerjee is key to India Alliance survival
  • కాంగ్రెస్ బహిష్కృత నేత మణిశంకర్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు
  • సారథ్యం దీదీకి అప్పగించాలని రాహుల్ గాంధీకి సూచన
  • ఎంపీ పదవి కోసమే అయ్యర్ తాపత్రయం అంటూ మండిపడ్డ బెంగాల్ కాంగ్రెస్ చీఫ్
ప్రతిపక్షాల ‘ఇండియా’ కూటమిపై కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత మణిశంకర్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమికి బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీయే అసలైన నాయకురాలని, ఆమె లేకపోతే కూటమి ఉనికే ఉండదని ఆయన పేర్కొన్నారు. నాయకత్వ బాధ్యతలను ప్రాంతీయ పార్టీలకు వదిలేయాలని ఆయన రాహుల్ గాంధీకి సూచించారు. గతంలో ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు రాహుల్ గాంధీ మణిశంకర్ అయ్యర్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన కేరళ సీఎం పినరయి విజయన్‌ను కూడా ప్రశంసించడంతో కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారారు.

అయ్యర్ ఏమన్నారంటే..
కోల్‌కతాలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న అయ్యర్, విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కూటమి నాయకత్వ బాధ్యతల్లో ప్రాంతీయ పార్టీల నేతలకు అవకాశం ఇవ్వాలని రాహుల్ గాంధీకి ఆయన హితవు పలికారు. ఈ కూటమికి మమతా బెనర్జీ వెన్నెముక వంటి వారు. ఆమె లేని ‘ఇండియా’ కూటమిని ఊహించలేమని వ్యాఖ్యానించారు. స్టాలిన్, మమతా దీదీ, అఖిలేశ్ యాదవ్, తేజస్వి యాదవ్ వంటి నేతలు కూటమిని నడిపించే సామర్థ్యం ఉన్నవారని మణిశంకర్ అయ్యర్ అభిప్రాయపడ్డారు.

భగ్గుమన్న బెంగాల్ కాంగ్రెస్..

అయ్యర్ వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సుమన్ రాయ్ చౌదరి మాట్లాడుతూ.. అయ్యర్‌కు పార్టీ కార్యకలాపాలతో సంబంధం లేదని తేల్చిచెప్పారు. ‘‘మమతా బెనర్జీ తెర వెనుక బీజేపీకి సహకరిస్తున్నారని అయ్యర్‌కు తెలియదా? రాజ్యసభ సీటు కోసమే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారేమో అని మాకు అనుమానంగా ఉంది’’ అని చౌదరి విమర్శించారు. కాగా, ప్రస్తుతం తమ దృష్టి అంతా బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించడంపైనే ఉందని, అయ్యర్ వంటి సీనియర్ నేతల వ్యాఖ్యలపై ఇప్పుడు స్పందించలేమని టీఎంసీ నాయకుడు కునాల్ ఘోష్ పేర్కొన్నారు.

Mamata Banerjee
Manishankar Aiyar
India Alliance
Congress
Rahul Gandhi
West Bengal
Opposition Unity
Political coalition
Indian Politics
TMC

More Telugu News