Rahul Gandhi: రాహుల్ గాంధీని కాల్చిపడేస్తానన్న వ్యక్తి అరెస్ట్

Rahul Gandhi Death Threat Suspect Arrested
  • రాహుల్ గాంధీకి హత్య బెదిరింపులు.. రాజస్థాన్‌లో కలకలం
  • వీడియో వైరల్ కావడంతో కర్ణిసేన కార్యకర్తగా భావిస్తున్న వ్యక్తి అరెస్ట్
  • ఇదంతా కుట్ర, తన పేరుతో ఫేక్ ఐడీ సృష్టించారన్న నిందితుడు
  • ఇది గోడ్సే మనస్తత్వం అంటూ బీజేపీ, ఆరెస్సెస్‌పై కాంగ్రెస్ ఫైర్
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి హత్య బెదిరింపులు జారీ చేసిన ఓ వ్యక్తిని రాజస్థాన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్ణిసేనకు చెందిన వ్యక్తిగా భావిస్తున్న రాజా అమేరా ఈ బెదిరింపులకు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో కోటా పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడు బెదిరింపులకు పాల్పడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పట్ల 25 మంది ప్రతిపక్ష ఎంపీలు అనుచితంగా ప్రవర్తించారని, దీనికి రాహుల్ గాంధీయే బాధ్యుడని ఆ వీడియోలో యువకుడు ఆరోపించాడు. ఇలాంటి ఘటన పునరావృతమైతే సంబంధిత ఎంపీల ఇళ్లను ధ్వంసం చేస్తామని, రాహుల్ గాంధీని ఆయన నివాసంలోనే కాల్చి చంపుతామని తీవ్రస్థాయిలో హెచ్చరించాడు. ఈ పని చేసినందుకు జైలుకు వెళ్లడానికైనా సిద్ధమేనని సవాల్ విసిరాడు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు వెంటనే స్పందించి, రాజా అమేరాను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. అయితే, పోలీసుల విచారణలో రాజా అమేరా తనపై వచ్చిన ఆరోపణలను ఖండించాడు. ఆ వీడియో గురించి తనకు ఏమీ తెలియదని, ప్రత్యర్థులు తన పేరుతో ఫేక్ ఐడీ సృష్టించి ఈ కుట్ర పన్నారని ఆరోపించాడు. తాను సనాతన హిందువునని, భారత్‌ను హిందూ దేశంగా చూడాలనుకుంటున్నానని చెప్పాడు.

ఈ ఘటనపై రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ గోవింద్ సింగ్ దోతసారా తీవ్రంగా స్పందించారు. రాహుల్ గాంధీని బహిరంగంగా చంపేస్తామని బెదిరిస్తున్నారని, ఇది నాథూరాం గాడ్సేను తయారు చేసిన విషపూరిత మనస్తత్వానికి నిదర్శనమని విమర్శించారు. భేదాభిప్రాయాలను 'దేశ వ్యతిరేకం'గా చిత్రీకరించి, హింసకు అనుకూలమైన వాతావరణాన్ని బీజేపీ-ఆరెస్సెస్ సృష్టిస్తున్నాయని ఆయన ఆరోపించారు. 
Rahul Gandhi
Rahul Gandhi death threat
Raja Amera
Rajasthan police
Govind Singh Dotasara
Karni Sena
Lok Sabha
Indian National Congress
death threats India
political threats

More Telugu News