Balka Suman: బాల్క సుమన్ అరెస్ట్ ను ఖండించిన హరీశ్ రావు

Harish Rao Condemns Balka Suman Arrest
  • కాంగ్రెస్ పార్టీ మురుగు రాజకీయాలు చేస్తోందన్న హరీశ్
  • చట్టాలను తుంగలో తొక్కుతోందని విమర్శ
  • ఛైర్మన్ పీఠాలను అడ్డదారుల్లో ఆక్రమించుకుంటున్నారని మండిపాటు

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మురుగు రాజకీయాలు చేస్తోందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ... క్యాతనపల్లిలో బీఆర్ఎస్‌కి పూర్తి మెజారిటీ వచ్చినా కాంగ్రెస్ పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని పరిహసించిన తీరును యావత్ తెలంగాణ అసహ్యించుకుంటోందని అన్నారు. అధికార బలం, ధన బలంతో చట్టాలను కాంగ్రెస్ తుంగలో తొక్కుతోందని విమర్శించారు. పోలీసులు కూడా అధికార పార్టీకి పూర్తిగా సహకరిస్తున్నారని అన్నారు. 


కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామిక చర్యలను అడ్డుకున్నందుకు దళిత నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను అరెస్టు చేసి నిర్బంధించడాన్ని ఖండిస్తున్నామని హరీశ్ రావు పేర్కొన్నారు. “జనగాంలో దళిత మహిళా కౌన్సిలర్ బీఆర్ఎస్ కు మద్దతుగా చెయ్యి ఎత్తితే రిటర్నింగ్ ఆఫీసర్ సాక్షిగా కాంగ్రెస్ గూండాలు దాడి చేశారు. అధికారులు, పోలీసులు కళ్లప్పగించి చోద్యం చూశారే తప్ప అడ్డుకోలేదు” అని ఆయన మండిపడ్డారు.


క్యాతనపల్లి, తొర్రూరు, జనగాం, ఇబ్రహీంపట్నం, జహీరాబాద్ సహా హంగ్ వచ్చిన ప్రతి చోటా ప్రజా తీర్పును కాంగ్రెస్ గౌరవించలేదని దుయ్యబట్టారు. చైర్మన్ పీఠాలను అడ్డదారుల్లో దక్కించుకుంటున్నారని ఆరోపించారు. భూములను కబ్జా చేసినట్లే, రాజకీయ పీఠాలను కూడా కబ్జా చేస్తున్నారని విమర్శించారు.

Balka Suman
Harish Rao
BRS
Telangana Municipal Elections
Congress Party
Khyathanapalli
Dalit Leader
Telangana Politics
Arrest Controversy
Political Conspiracy

More Telugu News