Amit Shah: రైతులకు పూర్తి రక్షణ... రాహుల్ గాంధీ తప్పుదోవపట్టిస్తున్నాడు: అమిత్ షా

Amit Shah Slams Rahul Gandhi for Misleading Farmers on Trade Deals
షార్ట్స్‌లో చూడండి
అమెరికా, యూరోపియన్ యూనియన్‌లతో భారత్ ఇటీవల కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాల వల్ల దేశంలోని రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రంగా ఖండించారు. రైతుల విషయంలో కాంగ్రెస్, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ అబద్ధాలు ప్రచారం చేస్తూ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ప్రతి ఒప్పందంలోనూ వ్యవసాయం, పాడి, మత్స్య రంగాల ప్రయోజనాలకు ప్రభుత్వం పూర్తి రక్షణ కల్పించిందని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం గాంధీనగర్‌లో దేశంలోనే తొలి సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ఆధారిత ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అమిత్ షా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పార్లమెంటులో నిలబడి రాహుల్ గాంధీ రైతుల ప్రయోజనాలను కాపాడతామని మాట్లాడటం నవ్వొస్తోందని ఎద్దేవా చేశారు. దేశ ప్రజలను తప్పుదోవ పట్టించడంలో కాంగ్రెస్‌కు సుదీర్ఘ చరిత్ర ఉందని, ఇప్పుడు వాణిజ్య ఒప్పందాల గురించి అబద్ధాలు ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో జరిగిన ప్రతి చర్చలోనూ రైతులు, పశుపోషకులు, మత్స్యకారుల ప్రయోజనాలకు ఎలాంటి హాని కలగకుండా సంపూర్ణ భద్రత కల్పించారని హామీ ఇచ్చారు.

గత యూపీఏ ప్రభుత్వంతో పోలుస్తూ తమ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి చేసిన మేలును అమిత్ షా వివరించారు. మన్మోహన్ సింగ్ హయాంలో కేవలం రూ. 26,000 కోట్లుగా ఉన్న వ్యవసాయ బడ్జెట్, ప్రధాని మోదీ నాయకత్వంలో రూ. 1,29,000 కోట్లకు పెరిగిందని గుర్తుచేశారు. గత దశాబ్ద కాలంలో కనీస మద్దతు ధరకు ఆహార ధాన్యాల సేకరణ పదిహేను రెట్లు పెరిగిందని తెలిపారు. "70 ఏళ్లుగా కాంగ్రెస్ రుణమాఫీ గురించి మాట్లాడిందే తప్ప చేసిందేమీ లేదు. కానీ మా ప్రభుత్వం, రైతులు అప్పులపాలు కాకుండా ఉండేందుకు ఏటా రూ. 6,000 నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది" అని ఆయన అన్నారు.

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల వల్ల దేశీయ పాడి రంగం దెబ్బతింటుందన్న విమర్శలను కూడా ఆయన తిప్పికొట్టారు. ప్రభుత్వం పాడి ఉత్పత్తి రంగాన్ని బలహీనపరచలేదని, మరింత బలోపేతం చేసిందని స్పష్టం చేశారు. అన్ని ఒప్పందాలలోనూ పాడి రంగానికి పూర్తి రక్షణ కల్పించామని పేర్కొన్నారు. ఈ అంశంపై ఎక్కడైనా, ఎప్పుడైనా బహిరంగ చర్చకు రావాలంటూ రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు కూడా ఈ చర్చకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. గత నెలలో భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు ముగియడం, అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదరడం వంటి పరిణామాల నేపథ్యంలో అమిత్ షా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Go Back to Shorts
Amit Shah
Rahul Gandhi
Farmers
India trade deals
European Union
Agriculture
MSP
Dairy sector
Central Bank Digital Currency
BJP

More Telugu News