Sports Viewership: ప్రేక్షకాదరణలో ఫుట్‌బాల్ కింగ్.. రెండో స్థానంలో క్రికెట్

FIFA World Cup Tops Cricket in Global Viewership
  • ప్రేక్షకాదరణలో ఫిఫా ప్రపంచకప్ ఫైనల్‌దే అగ్రస్థానం
  • 150 కోట్ల వీక్షణలతో ఫుట్‌బాల్ తిరుగులేని ఆధిపత్యం
  • రెండో స్థానంలో క్రికెట్ ప్రపంచకప్.. నాలుగో స్థానానికి పడిపోయిన సూపర్ బౌల్
  • డిజిటల్ వీక్షణలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న‌ ఐపీఎల్  
  • అమెరికాలో సూపర్ బౌల్‌కు క్రేజ్ ఉన్నా.. ప్రపంచవ్యాప్తంగా వెనుకంజ
ప్రతి ఏటా అమెరికాలో జరిగే సూపర్ బౌల్ ఈవెంట్ రాగానే, సోషల్ మీడియాలో ఓ పెద్ద చర్చ మొదలవుతుంది. ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడా ఈవెంట్ ఇదేనంటూ పాశ్చాత్య అభిమానులు వాదిస్తుంటారు. కానీ, వాస్తవ లెక్కలు చూస్తే ఈ వాదనలో వాస్తవం లేదని స్పష్టమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఫుట్‌బాల్ (సాకర్) తిరుగులేని రాజుగా నిలుస్తుండగా, డిజిటల్ వీక్షణలో క్రికెట్ వేగంగా దూసుకొస్తోంది. అమెరికాలో సూపర్ బౌల్‌కు ఎంత క్రేజ్ ఉన్నప్పటికీ, ప్రపంచవ్యాప్త ప్రేక్షకాదరణలో దాని స్థానం చాలా వెనుక ఉంది.

ఫిఫా ప్రపంచకప్.. తిరుగులేని ఆధిపత్యం
ప్రపంచంలో అత్యధిక మంది చూసిన ఫైనల్స్‌లో ఫిఫా ప్రపంచకప్‌దే అగ్రస్థానం. 2022లో ఖతార్ వేదికగా అర్జెంటీనా, ఫ్రాన్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌ను ప్రపంచవ్యాప్తంగా సుమారు 150 కోట్ల మంది వీక్షించారు. ఫిఫా అధికారిక లెక్కల ప్రకారమే ఈ సంఖ్య నమోదైంది. యూరప్, దక్షిణ అమెరికా, ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో ఏకకాలంలో ఇంత భారీ సంఖ్యలో వీక్షకులను ఆకట్టుకున్న ఏకైక ఈవెంట్ ఇదే. 

రెండో స్థానంలో క్రికెట్ ప్రపంచకప్
ఫిఫా ప్రపంచకప్ స్థాయిలో కాకపోయినా, అత్యధిక వీక్షకులను సంపాదించుకున్న రెండో అతిపెద్ద ఈవెంట్‌గా క్రికెట్ ప్రపంచకప్ నిలిచింది. 2023లో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఫైనల్‌ను సుమారు 50 కోట్ల మంది చూశారని ఐసీసీ, దాని అధికారిక ప్రసార భాగస్వాములు అంచనా వేశాయి. ముఖ్యంగా దక్షిణాసియా దేశాల్లోని అపారమైన జనాభా ఈ సంఖ్యకు కారణమైంది. బార్క్ (BARC) డేటా ప్రకారం కేవలం భారత్‌లోనే డిస్నీ స్టార్ నెట్‌వర్క్‌పై ఈ మ్యాచ్‌కు 422 బిలియన్ల వీక్షణ నిమిషాలు నమోదయ్యాయి.

ఐపీఎల్, సూపర్ బౌల్ స్థానం ఎక్కడ?
ఇక, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కేవలం దేశీయ లీగ్‌గా పరిమితం కాలేదు. 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన ఫైనల్‌ను టీవీ, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో కలిపి దాదాపు 30 కోట్ల మంది వీక్షించారు. ఇది ప్రపంచంలోనే అత్యధికంగా వీక్షించిన టీ20 మ్యాచ్‌గా నిలిచింది.

మరోవైపు 2025లో ఫిలడెల్ఫియా ఈగల్స్, కాన్సాస్ సిటీ చీఫ్స్ మధ్య జరిగిన సూపర్ బౌల్ ఫైనల్ అమెరికన్ టెలివిజన్‌లో రికార్డులు సృష్టించింది. కానీ, ప్రపంచవ్యాప్తంగా దీని వీక్షకుల సంఖ్య 19 కోట్లకు మాత్రమే పరిమితమైంది. ఇందులో 12.7 కోట్లు అమెరికా నుంచే ఉండగా, అంతర్జాతీయ వీక్షకులు 6.2 కోట్లు మాత్రమే. వాణిజ్యపరంగా, ప్రకటనల పరంగా సూపర్ బౌల్ బంగారు గని అయినప్పటికీ, ప్రపంచ ప్రేక్షకాదరణలో మాత్రం ఫుట్‌బాల్, క్రికెట్‌ల కంటే చాలా వెనుకబడి ఉంది. 
Sports Viewership
FIFA World Cup
Football
Cricket World Cup
IPL
Super Bowl
India vs Australia
Argentina vs France
Sports events
Cricket

More Telugu News