Danish Kaneria: భారత్‌ను చూసి పాక్ భయపడుతోంది.. ఆడి గెలవాలి కానీ..!: డానిశ్‌ కనేరియా

Danish Kaneria Slams Pakistan for India Match Boycott Fear
షార్ట్స్‌లో చూడండి
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను బహిష్కరించాలన్న పాకిస్థాన్ నిర్ణయంపై ఆ దేశ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. ఈ నిర్ణయం వల్ల పాకిస్థాన్ క్రికెట్‌కే ఎక్కువ నష్టం జరుగుతుందని, టీమిండియాను ఎదుర్కోవడానికి పాక్ భయపడుతోందనే తప్పుడు సంకేతాలు ప్రపంచానికి వెళతాయని అభిప్రాయపడ్డాడు.

ఈ నెల‌ 15న భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌లో ఆడబోమని పాకిస్థాన్ ప్రభుత్వం ఆదివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐఏఎన్ఎస్‌తో మాట్లాడిన కనేరియా, ఈ నిర్ణయంలో ఎలాంటి హేతుబద్ధత లేదని అన్నాడు. "భారత్‌లో ఆడబోమని పాకిస్థాన్ గతంలోనే కోరగా, ఆ విజ్ఞప్తిని అంగీకరించి భారత్-పాక్ మ్యాచ్‌ను శ్రీలంకలో (తటస్థ వేదిక) ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ మ్యాచ్‌ను బహిష్కరించడంలో అర్థం లేదు. ఈ నిర్ణయంతో పాకిస్థాన్ తమ సెమీఫైనల్ అవకాశాలను మరింత క్లిష్టతరం చేసుకుంది" అని క‌నేరియా పేర్కొన్నాడు.

"ప్రస్తుతం భారత్ ఆడుతున్న బ్రాండ్ క్రికెట్ ముందు పాక్ నిలబడలేకపోతోంది. ప్రపంచకప్‌లలో ప్రతీసారి భారత్ చేతిలో పాకిస్థాన్ ఓడిపోతూనే ఉంది. ఇప్పుడు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల భవిష్యత్తులో సెమీస్ లేదా ఫైనల్‌లో భారత్‌తో తలపడాల్సి వస్తే ఏం చేస్తారు? అప్పుడు కూడా ఆడకుండా ట్రోఫీని అప్పగిస్తారా? మైదానంలో పోరాడి గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలి కానీ, ఇలా బహిష్కరించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు" అని కనేరియా హితవు పలికాడు. ఈ నిర్ణయం పట్ల పాకిస్థాన్ క్రికెటర్లలో చాలా మంది అసంతృప్తితో ఉన్నప్పటికీ, వారు బహిరంగంగా మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నారని పేర్కొన్నాడు.
Go Back to Shorts
Danish Kaneria
Pakistan cricket
T20 World Cup 2026
India vs Pakistan
cricket match boycott
Pakistan government
cricket news
sports news
cricket world cup
Indian cricket team

More Telugu News