ట్రంప్‌కు ఎలాన్ మస్క్ థ్యాంక్స్.. త్వరలో ఆస్టిన్‌లో రీయూనియన్ పార్టీ
- విబేధాల తర్వాత మళ్లీ ఒక్కటైన ట్రంప్, ఎలాన్ మస్క్
- వైట్‌హౌస్‌లో సౌదీ యువరాజు విందుకు హాజరైన టెస్లా అధినేత
- అమెరికాకు చేసిన సేవలకు ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపిన మస్క్
- నాడు ట్రంప్ బడ్జెట్‌పై విమర్శలు.. నేడు పొగడ్తల వర్షం
ఈ కార్యక్రమంలో తన వ్యాపార ప్రసంగం సందర్భంగా ట్రంప్ సరదాగా మాట్లాడుతూ.. "ఎలాన్, నేను మీతో ఉన్నందుకు మీరు చాలా అదృష్టవంతులు" అని అన్నారు. "అతను నాకు ఎప్పుడైనా సరిగ్గా కృతజ్ఞతలు చెప్పాడా?" అని కూడా చమత్కరించారు. ఆ తర్వాత మస్క్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' వేదికగా స్పందించారు. "అమెరికాకు, ప్రపంచానికి మీరు చేసిన సేవలకు అధ్యక్షుడు ట్రంప్‌కు ధన్యవాదాలు" అని పేర్కొన్నారు. ఈ పోస్టులో ట్రంప్, సౌదీ యువరాజు, ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్‌తో కలిసి దిగిన ఫొటోలను కూడా పంచుకున్నారు.
కొన్ని నెలల క్రితం వరకు ట్రంప్ ప్రభుత్వంలో మస్క్ 'డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ' (DOGE) విభాగానికి అధిపతిగా ఉన్నారు. మే 30న ఆ పదవి నుంచి వైదొలిగిన తర్వాత, ట్రంప్ ప్రతిపాదించిన 'బిగ్ బ్యూటిఫుల్ బిల్' అనే భారీ ప్రభుత్వ వ్యయ ప్రణాళికను ఆయన బహిరంగంగా విమర్శించారు. ఒకప్పుడు మస్క్‌ను తన మొదటి మిత్రుడు అని పిలిచిన ట్రంప్‌తో ఆయనకు దూరం పెరిగింది.
ఈ నేపథ్యంలో ట్రంప్‌తో కలిసి పనిచేసిన కాలాన్ని పురస్కరించుకుని మస్క్ మిత్రులు ఆస్టిన్‌లో ఒక పెద్ద రీయూనియన్ పార్టీని ప్లాన్ చేస్తున్నట్లు న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. మస్క్ ఆధ్వర్యంలో 'డోగ్'లో పనిచేసిన డజన్ల కొద్దీ ఉద్యోగులు ఈ వారాంతంలో ఈ వేడుకలో పాల్గొంటారని తెలిపింది. ఈ కార్యక్రమానికి మస్క్ కూడా హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం.