Donald Trump: నెలకు ఒక యుద్ధం చొప్పున ఆపేశారట.. ట్రంప్ కు నోబెల్ ప్రైజ్ ఇవ్వాల్సిందేనంటున్న వైట్ హౌస్!

Donald Trump Deserves Nobel Prize Says White House
  • ట్రంప్ కు శాంతి బహుమతి కోసం అమెరికా అధ్యక్ష భవనం డిమాండ్
  • ఈజిప్ట్– ఇథియోపియా నుంచి థాయ్ లాండ్– కంబోడియా దాకా..
  • పలు దేశాల మధ్య యుద్ధాలను ఆపి శాంతి నెలకొల్పారని కితాబు
  • వందకు వంద శాతం ట్రంప్ శాంతి బహుమతికి అర్హుడన్న వైట్ హౌస్ మీడియా కార్యదర్శి
తమ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాల్సిందేనని అమెరికా మరోసారి డిమాండ్ చేసింది. తాజాగా థాయ్ లాండ్, కంబోడియాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందంటూ మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ప్రకటించిన నేపథ్యంలో వైట్ హౌస్ స్పందించింది. ఈ మేరకు వైట్ హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లివెట్ గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ అన్ని విధాలా అర్హుడేనని చెప్పారు.
 
ఈజిప్ట్– ఇథియోపియా మొదలుకొని తాజాగా థాయ్ లాండ్– కంబోడియాల దాకా.. తమ అధ్యక్షుడు ట్రంప్ సగటున నెలకు ఓ యుద్ధాన్ని నిలవరించారని కరోలిన్ పేర్కొన్నారు. దాడులు, ప్రతిదాడులతో రగిలిపోతున్న దేశాలను శాంతింపజేశారని వివరించారు. ఆయా దేశాల అధ్యక్షులు, ప్రధాన మంత్రులకు ఫోన్ చేసి యుద్ధం ఆపేయాలని హెచ్చరించారని తెలిపారు.

ట్రంప్ జోక్యం వల్లే థాయ్ లాండ్– కంబోడియా, ఇజ్రాయెల్– ఇరాన్, రువాండా– కాంగో (డీఆర్ సీ), ఇండియా– పాకిస్థాన్, సెర్బియా– కొసావో, ఈజిప్ట్– ఇథియోపియా దేశాల మధ్య యుద్ధాలు ఆగాయని చెప్పారు. ట్రంప్ జోక్యం చేసుకోకుంటే ఈ యుద్ధాల వల్ల భారీ మొత్తంలో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించేదని కరోలిన్ పేర్కొన్నారు. ప్రపంచ దేశాల మధ్య ఉద్రిక్తతలను చల్లార్చి శాంతిని నెలకొల్పిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాల్సిందేనని కరోలిన్ డిమాండ్ చేశారు.
Donald Trump
Trump Nobel Prize
Nobel Peace Prize
Thailand Cambodia
Israel Iran
Egypt Ethiopia
World peace
International relations
US Foreign Policy

More Telugu News