మళ్లీ అణ్వాయుధ కార్యక్రమాలు చేపడితే తీవ్ర పరిణామాలు: ఇరాన్‌‍కు ట్రంప్ హెచ్చరిక
Add ap7am to your home Screen

మళ్లీ అణ్వాయుధ కార్యక్రమాలు చేపడితే తీవ్ర పరిణామాలు: ఇరాన్‌‍కు ట్రంప్ హెచ్చరిక

Trump Warns Iran Against Nuclear Program Resumption
  • ఇరాన్ యురేనియం శుద్ధిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరిక
  • అణ్వాయుధాల జోలికి వెళ్తే మళ్లీ దాడులు తప్పవని వెల్లడి
  • ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ విరమణకు పుతిన్ సాయాన్ని తిరస్కరించిన ట్రంప్
  • రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలుకుతానని ట్రంప్ ప్రకటన
ఇరాన్ తన యురేనియం శుద్ధి కార్యక్రమాలను తక్షణమే నిలిపివేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. టెహ్రాన్ మరోసారి అణ్వాయుధ కార్యక్రమాల దిశగా అడుగులు వేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని, దాడులు చేయడానికి కూడా వెనుకాడబోమని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ మద్దతు ఉన్న సాయుధ ముఠాల ఆర్థిక వనరులను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులను ముమ్మరం చేసిన ప్రస్తుత తరుణంలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

ఇటీవల ఇజ్రాయెల్ వాయుసేన దక్షిణ లెబనాన్‌లో జరిపిన దాడిలో అల్‌ సాదిక్‌ కరెన్సీ ఎక్స్‌ఛేంజి అధిపతి అబ్దుల్లా బక్రి హతమయ్యారు. ఇరాన్‌కు చెందిన ఖుద్స్‌ ఫోర్స్‌ నుంచి హెజ్‌బొల్లాకు నిధులు మళ్లించడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ట్రంప్ హెచ్చరికలు ఇరాన్‌పై మరింత ఒత్తిడిని పెంచేవిగా ఉన్నాయి.

మరోవైపు, డొనాల్డ్ ట్రంప్ సామాజిక మాధ్యమాల్లో చేసిన ఒక పోస్ట్ కూడా చర్చనీయాంశమైంది. "ఇరాన్, ఇజ్రాయెల్ రెండు దేశాలు కూడా యుద్ధం ఆగాలని సమానంగా కోరుకున్నాయి. ఇరాన్ అణుకేంద్రాలు, అణు సామర్థ్యాలను ధ్వంసం చేయడం నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ఆ తర్వాతే యుద్ధాన్ని ఆపాను" అని ట్రంప్ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.

పుతిన్ సాయాన్ని తిరస్కరించా: ట్రంప్

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో కాల్పుల విరమణకు తాను మధ్యవర్తిత్వం వహించి సాయం చేస్తానని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రతిపాదించినట్లు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. అయితే, ఆ ప్రతిపాదనను తాను సున్నితంగా తిరస్కరించినట్లు తెలిపారు. నెదర్లాండ్స్‌లో త్వరలో ప్రారంభం కానున్న నాటో సదస్సుకు వెళుతున్న సందర్భంగా 'ఎయిర్‌ఫోర్స్‌ వన్‌' విమానంలో ఆయన జర్నలిస్టులతో ఈ విషయాలను పంచుకున్నారు.

"రష్యాతో ఒక ఒప్పందం కుదుర్చుకోవాలని నేను భావిస్తున్నాను. ఇటీవల పుతిన్ నాకు ఫోన్ చేసి 'ఇరాన్‌ యుద్ధం విషయంలో మీకు ఏమైనా సాయం చేయమంటారా?' అని అడిగారు. ఇరాన్‌ విషయంలో నాకు మీ సహాయం అవసరం లేదని స్పష్టంగా చెప్పాను. మీ (రష్యా) విషయంలోనే నాకు సహాయం కావాలి" అని పుతిన్‌తో అన్నట్లు ట్రంప్ వివరించారు.

నాటో సదస్సులో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీ అయ్యే అవకాశాలున్నాయని కూడా ట్రంప్ తెలిపారు. ప్రస్తుతం జెలెన్‌స్కీ ఎన్నడూ లేనంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డారు. గత మూడేళ్లుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి త్వరలోనే ముగింపు పలికి, ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిర్చేందుకు కృషి చేస్తానని ట్రంప్ ప్రకటించారు. గత వారంలోనే ఈ యుద్ధంలో సుమారు ఆరు వేల మంది సైనికులు మరణించినట్లు ఆయన పేర్కొన్నారు.
Advertisement
Donald Trump
Iran
nuclear program
Israel
Vladimir Putin
Russia
Ukraine
NATO summit

More Telugu News