సందీప్ వంగాకు రామ్ చరణ్, ఉపాసన నుంచి ఊహించని గిఫ్ట్
- ‘అత్తమాస్ కిచెన్’ ఆవకాయ జాడీ పంపిన మెగా జంట
- ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటో షేర్ చేసి కృతజ్ఞతలు తెలిపిన సందీప్
- ప్రభాస్‌తో ‘స్పిరిట్’ సినిమా పనుల్లో బిజీగా ఉన్న సందీప్
రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ ‘అత్తమాస్ కిచెన్’ నుంచి ప్రత్యేకంగా తయారు చేసిన ఆవకాయ పచ్చడి జాడీని సందీప్ రెడ్డి వంగాకు పంపించారు. దానితో పాటు ఓ ప్రేమపూర్వక సందేశాన్ని కూడా జతచేశారు. ఈ అనూహ్య కానుకకు సందీప్ రెడ్డి వంగా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. వెంటనే ఇన్‌స్టాగ్రామ్‌లో ఆవకాయ జాడీ ఫొటోను షేర్ చేస్తూ, "ఈ సర్‌ప్రైజ్ చాలా బాగుంది, టేస్టీగా కూడా ఉంటుంది" అని రాసుకొచ్చారు. చరణ్ దంపతులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా, నెటిజన్లు వావ్, సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ‘స్పిరిట్’ అనే భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ మొదటిసారి పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. అయితే, ఈ సినిమా హీరోయిన్ ఎంపిక విషయంలో గతంలో కొంత వివాదం నడిచినట్లు వార్తలు వచ్చాయి. తొలుత దీపికా పదుకునేను ఎంపిక చేసి, కథా చర్చల అనంతరం కొన్ని మనస్పర్థల కారణంగా ఆమెను ప్రాజెక్ట్ నుంచి తప్పించి, మరొక నాయికను ఖరారు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో దీపిక పీఆర్ టీమ్ ద్వారా ఈ సినిమాకు చెందిన కొన్ని కథనాలు లీక్ అవుతున్నాయని సందీప్ రెడ్డి వంగా సోషల్ మీడియా వేదికగా పరోక్షంగా విమర్శలు గుప్పించారు.