వర్షాల కోసం వరుణ యాగం.. సతీసమేతంగా పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy participates in Varuna Yagam for rains
  • తెలంగాణలో వర్షాల కోసం ప్రభుత్వం మహా వరుణ యాగం
  • నాగార్జున సాగర్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతుల పూజలు
  • ఎల్ నినో ప్రభావం, తగ్గిన జలమట్టాల నేపథ్యంలో ప్రత్యేక క్రతువు
  • యాదగిరిగుట్ట పండితుల ఆధ్వర్యంలో 11 హోమగుండాలతో యాగం
రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని, జలాశయాలు జలకళను సంతరించుకోవాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం సోమవారం 'మహా వరుణ యాగం' నిర్వహించింది. నాగార్జున సాగర్ సమీపంలోని కృష్ణా తీరంలో ఉన్న విజయ విహార్‌ వేదికగా ఈ క్రతువును శాస్త్రోక్తంగా జరిపించారు. యాగం ముగింపు సందర్భంగా నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు.

ఈ ఏడాది రుతుపవనాలు బలహీనంగా ఉండటం, ఎల్ నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో ప్రభుత్వం ఈ యాగానికి శ్రీకారం చుట్టింది. ఉదయం నుంచి సాగిన ఈ క్రతువులో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు కూడా పాల్గొన్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి చెందిన 108 మంది రుత్విక్కులు, వేద పండితుల పర్యవేక్షణలో 11 హోమ గుండాలతో ఈ యాగాన్ని వైభవంగా నిర్వహించారు.

ప్రస్తుతం నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.045 టీఎంసీలు కాగా, కేవలం 145.65 టీఎంసీల మేర మాత్రమే నీరు నిల్వ ఉంది. రిజర్వాయర్ గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం ఇది సుమారు 518 అడుగుల వద్దే కొనసాగుతోంది. గత ఏడాది ఇదే సమయానికి జలాశయం నిండుకుండలా ఉందని ఈ సందర్భంగా అధికారులు వెల్లడించారు.

రాష్ట్రవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురిసి, కృష్ణా, గోదావరి నదులు పరవళ్లు తొక్కాలని, చెరువులు నిండి అన్నదాతల పంటలు పచ్చగా ఉండాలన్న సంకల్పంతో ఈ యాగం నిర్వహించినట్లు ప్రభుత్వం అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. దేవాదాయ శాఖ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగింది.
Advertisement
Revanth Reddy
Varuna Yagam
Nagarjuna Sagar
Telangana Rain Ritual
Uttam Kumar Reddy
Krishna River

More Telugu News