మహారాష్ట్రలో కొత్త సిండ్రోమ్ తో ఒకరి మృతి..! లక్షణాలపై వైద్యులు ఏంచెబుతున్నారంటే..?
- రాష్ట్రంలో ప్రస్తుతం 101 మంది బాధితులు
- అందులో 16 మందికి వెంటిలేటర్ పై చికిత్స
- రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారికి ముప్పు ఎక్కువ
కలుషితమైన ఆహారం, నీరు తీసుకోవడం వల్ల డయేరియా వస్తుందనే విషయం తెలిసిందే. దీనికి కారణం కలుషిత ఆహారం ద్వారా శరీరంలోకి చేరే కాంపిలో బ్యాక్టర్ జెజునీ బ్యాక్టీరియా అని నిపుణులు చెబుతున్నారు. తాజా జీబీఎస్ కేసులకు కూడా ఇదే బ్యాక్టీరియా కారణమని వైద్యనిపుణులు అనుమానిస్తున్నారు. ఈ ఇన్ఫెక్షన్ విషయంలో శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ చేసే పొరపాటే జీబీఎస్ కు దారితీస్తుందని, ప్రతీ వెయ్యి మందిలో కేవలం ఒకరికి మాత్రమే ఈ పరిస్థితి ఎదురవుతుందని తెలిపారు. ఈ సిండ్రోమ్ బాధితులలో డయేరియా, పొత్తికడుపు నొప్పి, జ్వరం, వాంతులు తదితర లక్షణాలు కనిపిస్తాయని చెప్పారు.
అంటువ్యాధి కాదు..
జీబీఎస్ అంటువ్యాధి కాదని, ఒకరి నుంచి మరొకరికి సోకదని వైద్యులు స్పష్టం చేశారు. జీబీఎస్ బాధితులకు సరైన చికిత్స అందిస్తే కోలుకుంటారని ధైర్యం చెప్పారు. సుమారు 80 శాతం మంది బాధితులు చికిత్స తర్వాత ఆరు నెలల్లో పూర్తిగా కోలుకుంటారని తెలిపారు. కొందరిలో మాత్రం ఏడాది వరకూ ప్రభావం కనిపిస్తుందని చెప్పారు. అయితే, చికిత్స చాలా ఖరీదైందని అధికారులు తెలిపారు. చికిత్సలో భాగంగా రోగికి ఇచ్చే ఇమ్యునోగ్లోబిన్ ఇంజెక్షన్ ధర ఒక్కొక్కటి వేలల్లో ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో జీబీఎస్ బాధితులకు ఉచిత వైద్యం అందిస్తామని మహారాష్ట్ర ఆర్థిక మంత్రి అజిత్ పవార్ వెల్లడించారు.