వారిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు: రూమ‌ర్స్‌పై ఘాటుగా స్పందించిన సాయిప‌ల్ల‌వి

Actress Sai Pallavi Responds Strongly to Rumors
  • నిరాధార‌మైన పోస్టులు పెడితే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు ఎదుర్కొవాల్సి ఉంటుంద‌న్న న‌టి
  • త‌న మౌనాన్ని అవ‌కాశంగా తీసుకోవ‌ద్ద‌ని 'ఎక్స్' వేదిక‌గా సాయిప‌ల్ల‌వి వార్నింగ్
  • 'రామాయ‌ణ'లో సీత పాత్ర విష‌య‌మై ఆమెపై ఓ త‌మిళ వెబ్‌సైట్ క‌థ‌నాలు 
  • ఈ నేప‌థ్యంలోనే సాయిప‌ల్ల‌వి ఘాటుగా స్పందించిన వైనం 
త‌న‌పై వ‌స్తోన్న రూమ‌ర్స్‌పై సినీ న‌టి సాయిప‌ల్ల‌వి ఘాటుగా స్పందించారు. నిరాధార‌మైన పోస్టులు పెడితే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు ఎదుర్కొవాల్సి ఉంటుంద‌ని ఆమె హెచ్చ‌రించారు. త‌న మౌనాన్ని అవ‌కాశంగా తీసుకోవ‌ద్ద‌ని 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా సాయిప‌ల్ల‌వి వార్నింగ్ ఇచ్చారు. 

"చాలా సార్లు, దాదాపు ప్రతిసారీ నేను నిరాధారమైన పుకార్లు/ కల్పిత అబద్ధాలు/ తప్పుడు ప్రకటనలు వ్యాప్తి చెందడాన్ని చూసినప్పుడల్లా మౌనంగా ఉండటాన్ని ప్ర‌య‌త్నిస్తుంటాను. అలాంటి వాటికి స్పందించ‌డం అన‌వ‌స‌రం అనేది నా భావ‌న‌. కానీ ఇది ఆగ‌డం లేదు. స్థిరంగా అలాగే కొన‌సాగుతున్నందున నేను ప్రతిస్పందించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇక‌పై నా సినిమాల విడుదలలు, ప్రకటనలు, నా కెరీర్‌లో సంతోషించదగిన క్షణాల సమయంలో గాసిప్‌ల పేరుతో చెత్త కథనాన్ని ప్ర‌చురించ‌డం చేస్తే.. అలాంటి వారిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు ఉంటాయి" అని సాయిప‌ల్ల‌వి ట్వీట్ చేశారు. దీంతో ఇప్పుడీ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైర‌ల్ అవుతోంది. 

కాగా, ఆమె న‌టిస్తున్న బాలీవుడ్ మూవీ 'రామాయ‌ణ'లో సీత పాత్ర చేసేందుకు సాయిప‌ల్లవి త‌న అల‌వాట్లు, ప‌ద్ధ‌తులు మార్చుకున్నారంటూ ఓ త‌మిళ వెబ్‌సైట్ క‌థ‌నాలు ప్ర‌చురించింది. ఈ నేప‌థ్యంలోనే ఆమె ఈ విధంగా ఘాటుగా స్పందించారు.  
Advertisement
Sai Pallavi
Rumors
Twitter
Tollywood
Bollywood

More Telugu News