మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- ఎన్డీయే అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్న జనసేన అధ్యక్షుడు
- 2 రోజులపాటు 5 సభలు, 2 రోడ్ షోలలో పాల్గొననున్న జనసేనాని
- అధికారికంగా ప్రకటించిన జనసేన పార్టీ
మొదటి రోజున మరట్వాడా ప్రాంతంలోని నియోజకవర్గాల్లో పవన్ ప్రచారం నిర్వహిస్తారు. 16వ తేదీన ఉదయం నాందేడ్ జిల్లా డెగ్లూర్ నియోజకవర్గంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం అదే జిల్లాలోని భోకర్ నియోజకవర్గానికి వెళ్లి అక్కడ నిర్వహించే సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు లాతూర్ చేరుకుని సభలో పాల్గొననున్నారు. సాయంత్రం 6 గంటలకు షోలాపూర్ నగరం చేరుకొని అక్కడ రోడ్ షోలో పాల్గొంటారు.
మరుసటి రోజు విదర్భ ప్రాంతానికి డిప్యూటీ సీఎం పవన్ వెళ్లనున్నారు. ఉదయం చంద్రపూర్ జిల్లాలోని బల్లార్ పూర్ పట్టణంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం పుణే కంటోన్మెంట్ నియోజకవర్గం పరిధిలో నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం కస్బా పేట్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార సభలో పవన్ కల్యాణ్ పాల్గొంటారని జనసేన నేత పి.హరిప్రసాద్ ప్రకటించారు.