Nursing Student: మత్తు మందు కలిపిన నీళ్లు ఇచ్చి విద్యార్థినిపై ఆటో డ్రైవర్ అత్యాచారం

Nursing Trainee Raped In Maharashtra Auto Driver Had Spiked Her Drink
  • మహారాష్ట్రలోని రత్నగిరిలో దారుణం
  • కాలేజీ నుంచి ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కిన యువతి
  • మాటల్లో పెట్టి తాగేందుకు నీళ్లిచ్చిన డ్రైవర్
  • స్పృహ తప్పాక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి రేప్
మహారాష్ట్రలో మరో దారుణం జరిగింది. కాలేజీ నుంచి ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కిన ఓ నర్సింగ్ విద్యార్థినిపై డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. మత్తు మందు కలిపిన నీళ్లు ఇచ్చి, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఈ దారుణానికి తెగబడ్డాడు. 

ఓవైపు కోల్ కతా వైద్యురాలి హత్యాచారంపై దేశమంతటా నిరసనలు వ్యక్తం అవుతున్న వేళ ఈ ఘటన చోటుచేసుకోవడంతో మహారాష్ట్రలోని రత్నగిరిలో ఉద్రిక్తత నెలకొంది. ఈ నెల 24న జరిగిన ఈ దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది.

మాటల్లో పెట్టి మత్తు మందిచ్చి...

రత్నగిరిలో ఓ నర్సింగ్ విద్యార్థిని కాలేజీ నుంచి ఇంటికి బయలుదేరింది. అటుగా వచ్చిన ఆటోలో ఎక్కింది. ఒక్కతే ప్రయాణిస్తుండడంతో ఆటో డ్రైవర్ మంచిగా మాటలు కలిపాడు. తాగడానికి నీళ్లు ఇచ్చాడు. అయితే, అందులో అప్పటికే మత్తు మందు కలిపాడు. 

దాహంగా ఉండడంతో ఈ విషయం గుర్తించని విద్యార్థిని ఆ నీళ్లను తాగింది. కాసేపటికే స్పృహ తప్పింది. ఆ తర్వాత ఆటోను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన డ్రైవర్.. ఆమెపై అత్యాచారం చేశాడు. తర్వాత గాయాలపాలైన యువతిని అక్కడే వదిలేసి పరారయ్యాడు.

అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాలిని గమనించిన స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. స్పృహలోకి వచ్చిన తర్వాత తనపై అఘాయిత్యం జరిగిందని గుర్తించిన విద్యార్థిని కుటుంబ సభ్యులకు తెలియజేసింది. వారితో కలిసి పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

కాగా, విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డ ఆటో డ్రైవర్ ను వెంటనే అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బాధితురాలి కుటుంబంతో పాటు డాక్టర్లు, నర్సులు, నర్సింగ్ కాలేజీ స్టూడెంట్లు ఆందోళన చేపట్టారు.
Nursing Student
Raped
Auto driver
Maharashtra
Ratnagiri
Crime News

More Telugu News