అది నా బాధ్యత రేవంత్ రెడ్డి గారూ!: చిరంజీవి
Advertisement

అది నా బాధ్యత రేవంత్ రెడ్డి గారూ!: చిరంజీవి

Chiranjeevi thanked CM Revanth Reddy
  • ఇటీవల డ్రగ్స్ వ్యతిరేక ప్రచారంలో పాల్గొన్న చిరంజీవి
  • చిరంజీవి సందేశంతో వీడియో వైరల్
  • మిగతా సినీ తారలు కూడా చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకోవాలన్న సీఎం రేవంత్ రెడ్డి
  • టికెట్ల ధరల పెంపు జీవోల కోసం వస్తున్నారే తప్ప సామాజిక బాధ్యతతో ఎవరూ రావడంలేదని వెల్లడి
  • ఇకపై ధరల పెంపు కోరుతూ వచ్చే సినీ తారలు కచ్చితంగా ప్రభుత్వ ప్రచారంలో పాల్గొనాలని షరతు
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కోసం మెగాస్టార్ చిరంజీవి మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచారంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. చిరంజీవి తన సందేశంతో కూడిన వీడియోను రూపొందించి ప్రభుత్వానికి అందించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకట్టుకుంది. డ్రగ్స్ కు బానిసై జీవితాలు నాశనం చేసుకోవద్దని చిరంజీవి ఆ వీడియోలో పిలుపునిచ్చారు. 

అందుకు సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ... చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపారు. చిరంజీవి వంటి అగ్ర నటుడు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి డ్రగ్స్ వ్యతిరేక ప్రచారంలో పాల్గొనడం హర్షణీయం అని తెలిపారు. అయితే, మిగతా సినీ తారలు చిరంజీవి తరహాలో డ్రగ్స్ వ్యతిరేకం ప్రచారంలో పాల్గొనడంలేదని రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఏదైనా కొత్త సినిమా రిలీజైతే టికెట్ల ధరలు పెంచుకునేందుకు జీవోల కోసం ప్రభుత్వం వద్దకు వస్తున్నారే కానీ, సైబర్ క్రైమ్, డ్రగ్స్ నియంత్రణ పట్ల సామాజిక బాధ్యతతో ముందుకు రావడంలేదని సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. టాలీవుడ్ నటులు సామాజిక బాధ్యతను నెరవేర్చడంలేదని తమ ప్రభుత్వం భావిస్తోందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 

'ఇప్పుడు నేను మా అధికారులకు సూచన చేస్తున్నా... టికెట్ల ధరలు పెంచాలని ఎవరైనా సినిమా వాళ్లు జీవోల కోసం వస్తే, వాళ్లు తప్పనిసరిగా డ్రగ్స్ వ్యతిరేక ప్రచారంలో పాల్గొనేలా ముందస్తు నిబంధన విధించండి' అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. డ్రగ్స్ వాడకాన్ని వ్యతిరేకిస్తూ, చిరంజీవి స్ఫూర్తిగా అందరూ ఉద్యమంలో పాలుపంచుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. 

రేవంత్ రెడ్డి వ్యాఖ్యల వీడియోను తెలంగాణ పోలీస్ విభాగం ట్వీట్ చేసింది. దీనిపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. "థాంక్యూ రేవంత్ రెడ్డి  గారూ... ప్రజలకు ఎంతో ముఖ్యమైన సమాచారాన్ని ముందుకు తీసుకెళ్లడం అనేది నా బాధ్యతగా భావిస్తున్నాను" అంటూ వినమ్రంగా స్పందించారు.
Advertisement
Chiranjeevi
Revanth Reddy
Anti Drugs Campaign
Telangana
Tollywood

More Telugu News