ప్లీజ్.. నన్ను అలా పిలవకండి.. ఇబ్బందిగా ఉంది: విరాట్ కోహ్లీ
- చిన్నస్వామి స్టేడియంలో ఆర్‌సీబీ అన్‌బాక్స్ కార్యక్రమం
- తనను కింగ్ కోహ్లీ అని పిలవొద్దంటూ విరాట్ స్వీట్ వార్నింగ్
- కేవలం విరాట్ అని పిలిస్తే చాలన్న రన్ మెషీన్
- ఆర్‌సీబీ మహిళా జట్టు టైటిల్ గెలవడం పట్ల హర్షం
"ప్లీజ్.. మీరు నన్ను కింగ్ కోహ్లీ అని పిలవొద్దు. నాకు ఇబ్బందిగా ఉంది. ముందు మీరు అలా పిలవడం ఆపండి. విరాట్ అని పిలవండి చాలు. ఇదే విషయం డుప్లేసిస్‌తో కూడా చర్చించాను. మీరు ప్రతిసారి నన్ను కింగ్ కోహ్లీ అని పిలుస్తుంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకే ఇప్పటి నుంచి ఆ పదాన్ని ఉపయోగించకండి. కేవలం విరాట్ అని పిలిస్తే చాలు" అని కోహ్లీ తెలిపాడు.
ఇక ఈ కార్యక్రమంలో ఇటీవల డబ్ల్యూపీఎల్ ట్రోఫీ గెలిచిన ఆర్‌సీబీ మహిళా జట్టును బెంగళూరు యాజమాన్యం ఘనంగా సత్కరించింది. డబ్ల్యూపీఎల్ రెండో సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి బెంగళూరు టైటిల్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆర్‌సీబీ అభిమానులు 16 ఏళ్ల నిరీక్షణకు తెరదించి తమ కోరికను నెరవేర్చారని సంబర పడిపోతున్నారు. ఈ విషయమై కూడా కోహ్లీ మాట్లాడాడు. "ఆర్‌సీబీ మహిళలు డబ్ల్యూపీఎల్ టైటిల్ గెలవడం నిజంగా అద్భుతం. మేము కూడా ఈసారి ఐపీఎల్‌లో విజయం సాధించి ట్రోఫీలను డబుల్ చేస్తే, అది కచ్చితంగా ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుంది" అని చెప్పుకొచ్చాడు.