టీ20 వరల్డ్ కప్ నుంచి క్రికెట్‌లో కొత్త రూల్.. భారీ మార్పునకు సిద్ధమైన ఐసీసీ
- ‘స్టాప్ క్లాక్ రూల్’ను ప్రవేశపెట్టనున్న ఐసీసీ
- ఓవర్ ముగిసిన 60 సెకన్లలో తదుపరి ఓవర్ ప్రారంభించడం తప్పనిసరి
- రూల్‌ను ఉల్లంఘిస్తే 5 పరుగుల పెనాల్టీని విధించే అవకాశం
వెస్టిండీస్, అమెరికా వేదికగా జూన్ నెలలో ఆరంభం కానున్న టీ20 ప్రపంచ కప్ నుంచి ఈ నిబంధనను ఐసీసీ అమలు చేయనుంది. ఈ మేరకు ఐసీసీ రూల్ బుక్‌లోని నిబంధనను చేర్చనున్నారు. గతేడాది డిసెంబర్ నుంచే ఈ రూల్‌ని ఐసీసీ ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది. ప్రామాణిక పరిస్థితుల్లో ఆడే మ్యాచ్‌ల్లో ఈ నిబంధనను అమలు చేయవచ్చునని నిర్ధారణకు వచ్చింది. దీంతో ఈ నిబంధనను శాశ్వతంగా అమలు చేయాలని నిర్ణయించింది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రమే ఈ నిబంధనను అమలు చేయనున్నారు.
‘స్టాప్ క్లాక్ రూల్’ను శాశ్వతంగా అమలు చేసేందుకు దుబాయ్‌లో జరిగిన ఐసీసీ సమావేశంలో ఆమోదం లభించిందని క్రిక్‌బజ్ కథనం పేర్కొంది. ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఈ రూల్‌ను ప్రవేశపెట్టనున్నారని తెలిపింది. నిజానికి గతేడాది జరిగిన ఆసియా కప్‌లోనే ప్రవేశపెట్టాలనుకున్నా సాధ్యపడలేదని పేర్కొంది.