బీహార్ సీఎం పదవికి నితీశ్ రాజీనామా
- తన పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం తర్వాత నిర్ణయం
- గవర్నర్ ను కలిసి రాజీనామా పత్రం అందించిన నితీశ్
- తన నివాసంలో ఎన్డీయే ఎమ్మెల్యేలతో జేడీయూ చీఫ్ భేటీ
సీఎం నితీశ్ రాజీనామా చేస్తారంటూ కొన్నిరోజులుగా బీహార్ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది. మరోమారు ఎన్డీయే కూటమితో ఆయన జట్టుకడతారని ఊహాగానాలు వినిపించాయి. ఇప్పుడవి నిజం కానున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో ఎన్డీయే కూటమిలోనే ఉన్న నితీశ్.. మధ్యలో బీజేపీకి కటీఫ్ చెప్పి లాలూ ప్రసాద్ యాదవ్ తో చేతులు కలిపారు. అప్పట్లో కూడా సీఎం పదవికి ఉదయం రాజీనామా చేసిన నితీశ్.. లాలూ పార్టీ రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) తో పొత్తు పెట్టుకుని సాయంత్రం మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఆర్జేడీ కీలక నేత తేజస్వీ యాదవ్ కు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వడంతో పాటు ఇతర నేతలను కేబినెట్ లోకి తీసుకున్నారు. కాంగ్రెస్, టీఎంసీ, ఎన్సీపీ సహా పలు ప్రతిపక్షాలతో కలిసి ఇండియా కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన ఇండియా కూటమి నుంచి కూడా వైదొలిగినట్లేనని తెలుస్తోంది.