Chandrababu: బళ్లారిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు

Chandrababu unveils NTR statue in Ballari
షార్ట్స్‌లో చూడండి
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కర్ణాటకలోని బళ్లారిలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక తెలుగు ప్రజలు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు. బళ్ళారి కమ్మ సంఘం ఆధ్వర్యంలో ఈ విగ్రహ ఏర్పాటు జరిగింది. 

ఈ కార్యక్రమంలో చంద్రబాబు ప్రసంగిస్తూ, ఎన్టీఆర్ భారతదేశ సంపద అని కొనియాడారు. ఎన్టీఆర్ ఒక మహాశక్తి, గొప్ప వ్యవస్థ అని అభివర్ణించారు. "ఇక్కడ మీ ఉత్సాహం చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నానా... బళ్లారిలో ఉన్నానా అన్న సందేహం కలుగుతోంది. నందమూరి తారక రామారావు  శతజయంతి ఉత్సవాల సందర్భంగా విగ్రహం ఏర్పాటు చేయడం ఆనందించాల్సిన విషయం. ఎన్.టి.రామారావు భారతదేశ కీర్తి, తెలుగువారి సంపద. 

మనం ఇప్పుడు చెప్పుకునే ఆహార భద్రత పథకాన్ని నాడే తీసుకొచ్చిన మహానుభావుడు. అదీ ఆయన ఆలోచన... విశిష్టత.  ఒక్కసారి ఎన్టీఆర్ విగ్రహం చూసి ఏ సంకల్పం చేసినా అది కచ్చితంగా జయప్రదం అవుతుంది. సినీ రంగంలో ఆయన పోషించిన పాత్రలు ఎవరూ చేయలేరు. మరలా ఆయనే పుడితే తప్ప, అది సాధ్యం కాదు. రాముడు, భీముడు, కృష్ణుడు ఇలా ఏ పాత్ర అయినా దానిలో జీవించి, ప్రజల హృదయాల్లో నిలిచారు. 

రాజకీయాల్లోకి రావాలనుకొని ఆయన రాలేదు. తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతిన్నప్పుడు మనసు చలించి, తెలుగువాళ్లకు జరిగిన అగౌరవం, అవమానంపై కలత చెంది రాజకీయాల్లో అడుగుపెట్టారు. 

తెలుగుజాతి ఉన్నంతవరకు తెలుగువారి గుండెల్లో నిలిచే ఏకైక నాయకుడు నందమూరి తారకరామారావు. అలాంటి మహానీయుని విగ్రహం ఏర్పాటు చేసిన వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. కార్యక్రమానికి విచ్చేసిన స్థానిక నేతలు, అభిమానులను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను" అని చంద్రబాబు పేర్కొన్నారు.
Go Back to Shorts
Chandrababu
NTR Statue
Ballari
Karnataka
TDP
Andhra Pradesh

More Telugu News