ఈసారి విశాఖ నగరం నుంచి పవన్ కల్యాణ్ వారాహి యాత్ర
- ఇప్పటివరకు రెండు విడతలు పూర్తి చేసుకున్న వారాహి యాత్ర
- మూడో విడత విశాఖ నుంచి ప్రారంభం
- మంగళగిరి పార్టీ కార్యాలయంలో నేతలతో చర్చించిన నాదెండ్ల
- ఈసారి తొలి రెండు విడతలను మించిపోయేలా ఉండాలని స్పష్టీకరణ
ఈ యాత్రను విజయవంతం చేయడంపై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఇవాళ సన్నాహక సమావేశం నిర్వహించారు. మంగళగిరిలోని పార్టీ ప్రధానకార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో నాదెండ్ల మాట్లాడారు.
ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రెండు విడతలుగా నిర్వహించిన వారాహి యాత్ర విజయవంతమైందని వెల్లడించారు. తొలి రెండు విడతలను మించిపోయేలా విశాఖ నగరంలో పవన్ వారాహి యాత్ర ఉండాలని పార్టీ శ్రేణులకు నాదెండ్ల స్పష్టం చేశారు. జనసేన నేతలు, వీర మహిళలు, జనసైనికులు సమష్టిగా కృషి చేసి వారాహి యాత్ర ఉద్దేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
కాగా, వారాహి యాత్ర మూడో విడత సందర్భంగా విశాఖలో ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించే జనవాణి కార్యక్రమం కూడా ఉంటుందని నాదెండ్ల తెలిపారు. క్షేత్రస్థాయి పరిశీలనలు చేపట్టి, సంబంధిత ప్రజలతో పవన్ కల్యాణ్ సమావేశమై వారి సమస్యలు తెలుసుకుంటారని వివరించారు.