కోడిని కరిచిన కుక్క.. కొట్టుకున్న టీడీపీ, వైసీపీ నేతలు
- వైఎస్సార్ జిల్లా మాధవరం గ్రామంలో ఘటన
- టీడీపీ నేత కోడిపై వైసీపీ నేత కుక్క దాడి
- వాగ్వాదం పెరిగి, కొట్టుకున్న నేతలు
- ఇరు వర్గాలపై కేసు నమోదు చేసిన పోలీసులు
వివరాల్లోకి వెళ్తే... స్థానిక టీడీపీ నేత చలపాటి చంద్రకు ఒక కోడి ఉంది. ఈ కోడిని వైసీపీ నేత నారాయణరెడ్డి పెంచుకుంటున్న కుక్క కరిచింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం ప్రారంభమయింది. వాగ్వాదం పెరిగి ఒకరినొకరు కొట్టుకున్నారు. ఈ దాడిలో చంద్రకు గాయాలయ్యాయి. గాయపడిన చంద్రను కడపలోని సర్వజన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
నారాయణరెడ్డి, ఆయన కుమారుడు శ్రీనివాసరెడ్డి, మరికొందరిపై పోలీసులకు చంద్ర ఫిర్యాదు చేశారు. దీంతో వీరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నారాయణ ఇంటి వద్దకు వచ్చి తిడుతున్న చంద్రను తాను ప్రశ్నించానని... దీంతో తనను కులం పేరుతో దూషించాడని చంద్రపై చిన్న నాగయ్య అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. దీంతో, పోలీసులు చంద్రపై ఎస్సీ, ఎస్టీ కేసును నమోదు చేశారు. ఇంకోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చంద్రను పలువురు టీడీపీ నేతలు పరామర్శించారు.