Madhya Pradesh: యువతికి ‘కేరళ స్టోరీ’ చూపించిన బీజేపీ ఎంపీ.. తరువాత ముస్లిం యువకుడితో ఆమె పరార్!

  • భోపాల్‌లో వెలుగు చూసిన ఘటన
  • స్థానిక ముస్లిం యువకుడితో యువతి ప్రేమాయణం
  • యువతి మనసు మార్చేందుకు ఆమెను ‘ది కేరళ స్టోరీ’కి తీసుకెళ్లిన ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్
  • బెడిసికొట్టిన ఎంపీ ప్రయత్నం, ముస్లిం ప్రేమికుడితోనే యువతి పరార్
BJP MP Pragya Singh Thakur takes 19 year old girl to watch The Kerala Story she elopes with her Muslim lover

బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్‌కు తాజాగా ఊహించని అనుభవం ఎదురైంది. ముస్లిం యువకుడితో ప్రేమలో పడ్డ ఓ యువతి మనసు మార్చేందుకు ఆమె చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ఎంపీ స్వయంగా యువతికి ‘ది కేరళ స్టోరీ’ చూపించగా ఆ తరువాత యువతి తన ముస్లిం ప్రియుడితో పరారైంది. ముస్లిం యువకుల ట్రాప్‌లో చిక్కుకుని మోసపోయిన హిందూ యువతుల జీవితం ఇతివృత్తంగా ‘ది కేరళ స్టోరీ’ని తెరకెక్కించారు.

భోపాల్‌లోని నయా బసేరా ప్రాంతానికి చెందిన ఓ నర్సింగ్ విద్యార్థిని (19) స్థానికంగా ఉంటున్న యూసుఫ్‌తో ప్రేమలో పడింది. యూసుఫ్‌ ఓ రౌడీ షీటర్. అప్పటికే అతడిపై ఆరు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు యువతి వివాహం మరో వ్యక్తితో నిశ్చయమైంది. మే 30న ముహూర్తం ఖరారైంది. ఇదిలా ఉంటే, యువతి మనసు మార్చేందుకు ఎంపీ సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్ రంగంలోకి దిగారు. ఆమెను వెంటపెట్టుకుని వెళ్లి ‘ది కేరళ స్టోరీ’ చూపించారు. ఆ తరువాత యువతి అనూహ్యంగా తన ప్రియుడితో వెళ్లిపోయింది. వెళుతూ వెళుతూ ఇంట్లో తన పెళ్లి కోసం దాచిన నగలను కూడా వెంట తీసుకెళ్లిపోయింది. 

దీంతో, యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యూసుఫ్ తమ కూతురికి మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడని ఆరోపించారు. ఆమెతో బ్యాంకులో అప్పు చేయించి ఈఎంఐలు కట్టిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, తన తల్లిదండ్రుల ఆరోపణల్ని యువతి ఖండించింది. తన ఇష్ట ప్రకారమే అతడితో వెళ్లిపోయానని చెప్పింది. 

More Telugu News