పదేళ్ల నాటి పగ.. కాల్పుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి మృతి!
- మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లాలో విషాదం
- రెండు కుటుంబాల మధ్య శత్రుత్వం
- మృతులలో ముగ్గురు మహిళలు కూడా
మొరేనాకు 60 కిలో మీటర్ల దూరంలోని దిమానీ అసెంబ్లీ పరిధిలోని లేపా గ్రామంలో ఉదయం పది గంటల సమయంలో ఈ ఘోరం జరిగింది. బాధితుల్లో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా, మిగతా వారు జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా కన్నుమూశారు. బుల్లెట్ గాయాలు కావడంతో వీరు మరణించినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. హత్యకు పాల్పడిన ఎనిమిది మందిని పోలీసులు గుర్తించారు. వారిపై కేసు నమోదు చేశారు.
హత్యకు గల కారణాలపై ఆరా తీయగా... మృతుల కుటుంబానికి, నిందితుల కుటుంబానికి పాత శత్రుత్వం ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుత ఘటనలో చనిపోయిన వారి కుటుంబం.... ఇప్పుడు హత్య చేసిన కుటుంబ సభ్యులను గతంలో చంపేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయని చెబుతున్నారు.