దర్యాప్తు సంస్థల దుర్వినియోగం కేసులో ప్రతిపక్షాలకు సుప్రీంకోర్టులో చుక్కెదురు
- సీబీఐ, ఈడీ దుర్వినియోగం అవుతున్నాయంటూ ‘సుప్రీంను’ ఆశ్రయించిన ప్రతిపక్షాలు
- దీన్ని నిరోధించేందుకు మార్గదర్శకాలు జారీ చేయాలని కోర్టుకు వినతి
- ప్రతిపక్షాల అభ్యర్థనను తోసిపుచ్చిన న్యాయస్థానం
- పిటిషన్ ఉపసంహరించుకున్న పార్టీలు
ప్రతిపక్షాల తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ మార్చి 24న ఈ పిటిషన్ దాఖలు చేశారు. దర్యాప్తు సంస్థలు దుర్వినియోగం కాకుండా మార్గదర్శకాలు జారీ చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో ఏకంగా 14 ప్రతిపక్షాలు ఏకతాటిపైకి రావడం అసాధారణమని కోర్టు దృష్టికి తెచ్చారు. సీబీఐ, ఈడీ దాఖలు చేసిన 95 శాతం కేసుల్లో నిందితులు ప్రతిపక్ష పార్టీల నేతలేనని తెలిపారు. 2014లో ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక దర్యాప్తు సంస్థల కేసులు పెరిగిన విషయాన్ని కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో.. ప్రతిపక్షాలపై పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు ఏప్రిల్ 5న విచారణ చేపడతామని అప్పట్లో పేర్కొంది.
అయితే..ప్రతిపక్షాలు కోరినట్టు మార్గదర్శకాలు జారీ చేయడం కుదరదని కోర్టు బుధవారం స్పష్టం చేసింది. ‘‘సీబీఐ, ఈడీ కేసుల వల్ల ప్రతిపక్ష నేతలపై ప్రతికూల ప్రభావం పడుతోందని రాజకీయ పార్టీలు వాదిస్తుంటే.. సమాధానం కూడా రాజకీయక్షేత్రంలోనే ఉంది. కోర్టులో కాదు’’ అని న్యాయస్థానం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. దీంతో.. ప్రతిపక్షాలు తమ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నాయి.