Adithi Rao: అనార్క‌లిగా న‌టించ‌డం ఛాలెంజింగ్‌గా అనిపించింది: అదితీరావు హైద‌రి

  • ఇటీవలే జీ 5లో స్ట్రీమింగ్ అయిన 'తాజ్ డివైడెడ్ బై బ్లడ్' 
  • అనార్కలి పాత్రలో మెప్పించిన అదితీ రావు 
  • ఆ పాత్ర తనకి ఎంతో కనెక్ట్ అయిందని వెల్లడి 
  • సీనియర్స్ తో పని చేయడం పట్ల ఆనందం 
  • రేఖ బయోపిక్ లో చేయాలనుందనే ఆకాంక్ష  
Adithi Rao Interview

ఓటీటీ చానెల్ జీ5లో మార్చి 3 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న పిరియాడిక్ డ్రామా వెబ్ సిరీస్ .. ‘తాజ్ డివైడెడ్ బై బ్లడ్’. ఈ సిరీస్‌ను కాంటిలో పిక్చ‌ర్స్ రూపొందించింది. ఇందులో స్టార్ హీరోయిన్ అదితీరావు హైద‌రి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించారు. ధ‌ర్మేంద్ర‌, న‌సీరుద్దీన్ షా, రాహుల్ బోస్‌, జ‌రీనా వ‌హాబ్‌ త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు. అభిమ‌న్యు సింగ్‌ - రూపా సింగ్‌ ఈ పీరియాడిక్ డ్రామాను నిర్మించారు. రాన్ స్కాల్‌పెల్లో, అజ‌య్ సింగ్‌, విబు పూరి ఈ షోను డైరెక్ట్ చేశారు. 

జీ5లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ గురించి అదితీరావు హైద‌రి మాట్లాడుతూ .. "అనార్క‌లి పాత్ర నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన‌ప్పుడు నేను చేయ‌గ‌ల‌నా? అని ఆలోచించాను. అయితే ద‌ర్శ‌కులు నాపై న‌మ్మ‌కం ఉంచినందుకు చాలా ఆనందంగా అనిపించింది. ఆ స‌మ‌యంలో నేను చేయ‌న‌ని చెబితే వారు ఒప్పుకునేలా లేరు కూడా. 'మొఘ‌ల్ ఈ ఆజామ్' (హిందీ సినిమా)కి భిన్న‌మైన కోణంలో ఈ కథ నడుస్తుందని వారు చెప్పారు.  

ఈ పాత్ర అంద‌రూ అనుకున్నంత సుల‌భ‌మైతే కాదు. ఓ న‌టిగా ద‌ర్శ‌కుడు ఏం అనుకుంటున్నారో దాన్ని మ‌నం ప్రెజెంట్ చేయ‌గ‌ల‌గాలి. అప్పుడే ప్ర‌జ‌ల హృద‌యాల్లో చాలా రోజుల పాటు గుర్తుండిపోతాం. నేను నా ప‌నిని ప్రేమిస్తున్నాను. అందుక‌నే నా పాత్ర‌లలో నేను పూర్తిగా ల‌గ్న‌మైపోతాను. 'తాజ్ డివైడెడ్ బై బ్ల‌డ్' సిరీస్‌లో నేను చేసిన అనార్క‌లి పాత్ర నాకు పూర్తిగా ఛాలెంజింగ్‌గా ఆనిపించింది. ఎందుకంటే అదొక చారిత్రాత్మ‌క పాత్ర‌. 

జీ 5లోని తాజ్ డివైడెడ్ బై బ్ల‌డ్‌లో చూపించిన అనార్కలి పాత్ర‌.. అమాయ‌కంగా ఉంటుంది .. అలాగే నిర్భ‌యంగాను క‌నిపిస్తుంది. మ‌రో వైపు మాన‌వ‌త‌ను చూపిస్తుంది. ఆ పాత్రను స‌రికొత్త‌గా చిత్రీక‌రించిన విధానం న‌చ్చింది. నా దృష్టిలో ప్రేమ‌ను మించి శ‌క్తిమంత‌మైన అంశం ఇంకోటి ఉండ‌దు. అనార్క‌లి పాత్ర‌లో న‌టించ‌డం వ‌ల్ల నేను ప్ర‌త్యేకంగా అర్థం చేసుకున్న‌ది అదే. 

అంజు మోడి నా కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు. అవి హెవీగా అనిపించ‌లేదు. ఇంత‌కు ముందే చెప్పిన‌ట్టు అనార్క‌లి చాలా సున్నిత‌మైన అమ్మాయి. నాజూకైన అమ్మాయి. అందుకే బ‌రువైన కాస్ట్యూమ్స్ వ‌ద్ద‌నుకున్నాం. డిజైన‌ర్ కూడా బ‌రువు త‌క్కువ ఉండే  స‌న్న‌టి వ‌స్త్రాల‌ను డిజైన్ చేశారు. చాలా బావున్నాయి. జువెల‌రీ కూడా భారీగా ఉండ‌దు. నేను ధ‌రించిన ప్ర‌తిదీ ఒరిజిన‌ల్ జువెల‌రీనే.

తాజ్‌లో చాలా మంది లెజెండ్స్‌తో ప‌నిచేసే అవ‌కాశం వ‌చ్చింది. ధ‌ర్మేంద్ర సార్‌తో మాత్రం ప‌నిచేయ‌లేక‌పోయాను. ఆయ‌న న‌టించిన ఎపిసోడ్స్ అన్నీ మ‌రో కాలానికి సంబంధించిన‌వి కావ‌డంతో నేను అప్పుడు సెట్లో లేను. న‌సీరుద్దీన్‌షా గారితో ప‌నిచేయ‌డం మ‌ర్చిపోలేని అనుభూతి. నా దృష్టిలో గొప్ప న‌టీన‌టులంద‌రూ నిగ‌ర్వులు .. స‌ర‌దాగా ఉంటారు .. చేస్తున్న ప‌నిని ప్రేమిస్తారు. అంద‌రినీ కంఫ‌ర్ట్ జోన్‌లో ఉంచుతారు. 

నాకు మ‌రిన్ని తెలుగు సినిమాల్లో న‌టించాల‌ని ఉంది. సినిమాల‌ను 50 .. 60 రోజుల్లో పూర్తి చేస్తాం. కానీ వెబ్ సీరీస్‌ల‌కు ఎక్కువ స‌మ‌యం ప‌డుతుంది. మిగతా విషయాల్లో సినిమాల‌కూ, ఓటీటీల‌కు తేడా ఏం ఉండ‌దు. అంద‌రూ ప్రాణం పెట్టి ప‌నిచేస్తారు. రీసెంట్ గా 'ఆర్ ఆర్ ఆర్' చూశాను. రాజ‌మౌళి సార్‌తో పాటు యూనిట్ అంతా అద్భుత‌మైన ప్ర‌తిభ‌ను క‌న‌బ‌రిచారు. మంచి క‌థ‌ల కోసం విదేశాల్లో వెత‌క‌కుండా, మ‌న ద‌గ్గ‌ర ఉన్న క‌థ‌ల‌ను ఆద్భుతంగా చెప్ప‌డానికి ప్ర‌య‌త్నించ‌డం ఆనందం క‌లిగించింది. 

నాకు బాలీవుడ్ వ‌ర్సెస్ సౌత్ సినిమా చ‌ర్చ మీద న‌మ్మ‌కం లేదు. నేను త‌మిళ్ సినిమాతో కెరీర్ మొద‌లుపెట్టాను. నా మ‌న‌సులో అస‌లు భేద‌భావాలేం లేవు. మ‌నం మ‌న జ‌నాల కోసం సినిమాలు చేస్తున్నాం. భిన్న‌త్వంలో ఏక‌త్వంగా ఉన్నందుకు మనం గ‌ర్వ‌ప‌డాలి. మ‌న సంస్కృతులు, భాష‌లు, ర‌క‌ర‌కాల ప్ర‌తిభ‌ల‌ను చూసి మురిసిపోవాలి. ద‌క్షిణాదిన కూడా నాలుగు భారీ సినిమా ఇండ‌స్ట్రీలున్నాయన్న విష‌యాన్ని గుర్తుంచుకోవాలి. 

నాకు తెలుగు, త‌మిళ్ బాగా అర్థ‌మ‌వుతుంది .. మ‌ల‌యాళం అర్థం కాదు. హిందీ బాగా మాట్లాడుతాను ..  ఉర్దూ కూడా మేనేజ్ చేయ‌గ‌ల‌ను. న‌టిగా ఇంకా చాలా చేయాల‌ని అనుకుంటాను. మ‌ణిర‌త్నంగారితోనూ, సంజ‌య్ లీలా భ‌న్సాలీతోనూ రిపీటెడ్‌గా ప‌నిచేసే అవ‌కాశాలు రావ‌డం నా అదృష్టం. నాలో ఇంకా ప్ర‌తిభ ఉంద‌ని ఎవ‌రైనా భావిస్తే ఆనందంగా ప్రాజెక్టులు చేయ‌డానికి సిద్ధంగా ఉన్నాను. ఒక‌వేళ రేఖ‌గారి బ‌యోపిక్‌లో న‌టించే అవ‌కాశం వ‌స్తే అదొక గొప్ప అవ‌కాశంగా భావిస్తాను" అంటూ చెప్పుకొచ్చారు.

More Telugu News