చత్తీస్‌గఢ్‌లో దారుణం.. పెళ్లి రిసెప్షన్‌కు ముందు రక్తపు మడుగులో విగతజీవులుగా కొత్త జంట!

Newly Weds Found Dead Before Reception
  • చత్తీస్‌గఢ్‌లోని బ్రిజ్ నగర్‌లో ఘటన
  • రిసెప్షన్ కోసం ముస్తాబయ్యేందుకు గదిలోకి వెళ్లిన జంట
  • గదిలోకి వెళ్లాక ఇద్దరి మధ్య గొడవ
  • కోపంతో వధువును కత్తితో పొడిచి, తర్వాత ఆత్మహత్య చేసుకున్న వరుడు!
మరికొన్ని గంటల్లో పెళ్లి రిసెప్షన్‌కు హాజరు కావాల్సిన నూతన జంట రక్త మడుగులో విగతజీవులుగా కనిపించడంతో కలకలం రేగింది. వరుడే ఆమెను హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. చత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌లోని బ్రిజ్‌నగర్‌లో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  అస్లాం (24), కహకషా బానో (24)లకు ఆదివారం వివాహం  జరిగింది. నిన్న రాత్రి రిసెప్షన్ జరగాల్సి ఉంది. 

ముస్తాబయ్యేందుకు నూతన దంపతులు ఓ గదిలోకి వెళ్లారు. కాసేపటికే గదిలోంచి వధువు అరుపులు వినిపించడంతో వరుడి తల్లి పరిగెత్తుకుంటూ గదిలోకి వెళ్లింది. అయితే, గదికి లోపలి నుంచి గడియపెట్టి ఉండడంతో కుటుంబ సభ్యులు కిటికీ నుంచి లోపలికి తొంగిచూసి షాకయ్యారు. వధూవరులు ఇద్దరూ రక్తపు మడుగులో కనిపించడంతో వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. 

పోలీసులు వచ్చి గది తలుపులు బద్దలుగొట్టి లోపలికి వెళ్లారు. అయితే, అప్పటికే వారు మృతి చెందారు. గదిలో రక్తపు మరకలతో ఉన్న కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రిసెప్షన్‌కు ముందు ఇద్దరూ ఏదో విషయంలో గొడవపడి ఉంటారని, దీంతో వరుడు కత్తితో ఆమెను పొడిచి, అనంతరం తనను తాను పొడుచుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Advertisement
Chhattisgarh
Raipur
Newly Wed Couple
Crime News

More Telugu News