TRS: అమిత్​ షా.. మీ స్థాయిని తగ్గించుకోకండి.. మంత్రి హరీశ్​​ రావు ఫైర్​

Amit Shah Dont lower your level Says Minister Harish Rao
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిన్న జరిగిన బీజేపీ బహిరంగ సభలో కేంద్ర మంత్రి అమిత్ షా అన్నీ అబద్ధాలే చెప్పారని తెలంగాణ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. బీజేపీ నేతల మాటల్లో ఏమాత్రం విషయం లేదని.. అంతా విషమేనని ఆరోపించారు. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దారుణమన్నారు. తెలంగాణలో నీళ్లు వచ్చింది నిజం కాదా? అని నిలదీశారు. నీళ్లు వచ్చాయో లేదో ఇక్కడి రైతులను అడిగితే చెబుతారని స్పష్టం చేశారు. 

రాసిచ్చిన స్క్రిప్టును చదివారు
‘‘అమిత్‌షా.. అవగాహన లేకుండా మీ స్థాయిని తగ్గించుకోవద్దు. నీళ్లు వచ్చాయనేందుకు తెలంగాణలో పెద్ద ఎత్తున పండిన పంటలే నిదర్శనం. తెలంగాణ నుంచి లక్ష కోట్ల విలువైన ధాన్యం కొన్నామని ప్రధాని మోదీ అన్నారు. మరి నీళ్లు లేనిదే పంటలు ఎలా పండాయి? అంత ధాన్యం ఎలా కొన్నారు? దేశంలో పంజాబ్‌ తర్వాత ఎక్కువగా వరి పండిస్తున్నది తెలంగాణ రాష్ట్రమేనని నీతి అయోగ్‌ చెప్పింది. దేశంలో వ్యవసాయ వృద్ధి రేటు సగటున 3 శాతమే ఉంటే.. తెలంగాణలో 10 శాతంగా ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అమిత్ షా బీజేపీ నేతలు తప్పుగా రాసిచ్చిన స్క్రిప్టును చదివినట్టు ఉన్నారు. నీళ్ల గురించి బీజేపీ వాళ్లను కాదు.. అసలైన రైతులను అడగండి చెబుతారు..” అని హరీశ్ రావు స్పష్టం చేశారు.

సరిగా నిధులిస్తే మరింత అభివృద్ధి
తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులను కేంద్ర ప్రభుత్వం సరిగా కేటాయించి ఉంటే రాష్ట్రం మరింత అభివృద్ది చెంది ఉండేదని హరీశ్ రావు పేర్కొన్నారు. రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నిధులను సికింద్రాబాద్ సభలో ప్రధాన మంత్రి ప్రకటిస్తారని అనుకున్నామని.. కానీ ఆ ఊసే ఎత్తలేదని మండిపడ్డారు. ప్రధాని మోదీ కూడా సభలో అబద్ధాలు చెప్పారని మంత్రి హరీశ్ రావు ఆరోపించారు.
TRS
BJP
Amit Shah
Harish Rao
Narendra Modi

More Telugu News