Supreme Court: అలా అయితే భర్త ఆస్తిపై భార్యకు పూర్తి హక్కులు ఉండవు: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

wife does not have full rights over the husbands property says Supreme Court
  • పరిమితులతో కూడిన వీలునామా రాసిన భర్త
  • భర్త చనిపోవడంతో భార్య నుంచి ఆస్తిని కొనుగోలు చేసిన వ్యక్తులు
  • పరిమితులతో వీలునామా రాస్తే పూర్తి హక్కులు భార్యకు సంక్రమించబోవన్న కోర్టు
  • కొన్న వారికి అనుకూలంగా సేల్ డీడ్ కొనసాగించలేమని స్పష్టీకరణ
భర్త సంపాదించిన ఆస్తిపై భార్యకు సంక్రమించే హక్కులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భర్త కనుక పరిమితులతో కూడిన వీలునామా రాస్తే దానిపై పూర్తి హక్కులు ఆమెకు సంక్రమించబోవని ధర్మాసనం స్పష్టం చేసింది. హర్యానాకు చెందిన తులసీరామ్ కేసులో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

తులసీరామ్ తన మొదటి భార్య చనిపోవడంతో రెండో భార్య అయిన రామ్‌దేవి, కుమారుడికి తన ఆస్తి చెందేలా 1968లో వీలునామా రాశారు. దాని ద్వారా వచ్చే ఆదాయంతో ఆమె జీవించవచ్చని ఆయన పేర్కొన్నారు. అయితే, భార్య మరణానంతరం ఆస్తి మొత్తం తన కుమారుడికే చెందాలంటూ కొన్ని పరిమితులు విధించారు. తులసీరామ్ 1969లో మృతి చెందడంతో కొందరు వ్యక్తులు ఆ ఆస్తిని కొనుగోలు చేశారు. ఇది వివాదానికి కారణమై చివరికి సుప్రీంకోర్టుకు చేరింది.

జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఎం.ఎం సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం నిన్న దీనిని విచారించింది. వాదనలు విన్న అనంతరం.. హిందూ వ్యక్తి తన భార్య పోషణ, బాగోగుల కోసం ఏర్పాట్లు చేసి, తాను సంపాదించిన ఆస్తిని భార్య.. జీవితాంతం అనుభవించేలా పరిమితులతో కూడిన వీలునామా రాస్తే కనుక సంబంధిత ఆస్తిపై ఆమెకు సంపూర్ణ హక్కులు సంక్రమించబోవని స్పష్టం చేసింది. రామ్‌దేవి నుంచి ఆస్తిని కొనుగోలు చేసిన వ్యక్తులకు అనుకూలంగా సేల్ డీడ్‌లను కొనసాగించలేమని ధర్మాసనం తేల్చి చెప్పింది.
Supreme Court
Assets
Wife
Husband

More Telugu News