Republic Day: 20 ఏళ్ల యువతిపై అత్యాచారం.. మెడలో చెప్పుల దండేసి వీధుల్లో ఊరేగింపు.. రిపబ్లిక్ డే నాడే దారుణం.. ఇదిగో వీడియో

  • ఢిల్లీలోని కస్తూర్బా నగర్ లో దారుణ ఘటన
  • అక్రమ మద్యం అమ్మకందారుల వికృత చర్య
  • ఆపాల్సిన మహిళలే దగ్గరుండి ప్రోత్సహించిన వైనం
  • సీరియస్ అయిన ఢిల్లీ మహిళా కమిషన్
  • ఢిల్లీ పోలీసులకు నోటీసులు.. చర్యలు తీసుకోవాలని ఆదేశం
Woman Gang Raped And Paraded After Head Tonsured

ఓ మహిళను ఇంటి నుంచి బయటకు లాగి సామూహిక అత్యాచారం చేశారు కొందరు దుండగులు. శిరోముండనం చేసి, మెడలో చెప్పులదండేసి వీధుల్లో ఊరేగించారు. ఈ దారుణ ఘటన ఢిల్లీలోని వివేక్ విహార్ కస్తూర్బా నగర్ లో గణతంత్ర దినోత్సవం రోజునే జరిగింది. బాధితురాలి చెల్లెలి ఫిర్యాదు మేరకు పోలీసులు నలుగురిని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది.

ఆమె చేసిన నేరం ఏమీ లేదు. భర్త చనిపోవడంతో.. ఉన్న ఒక్కగానొక్క కూతురితో కలిసి  బతుకుతోంది. ఆమె ఇంటి పక్కనే ఉండే ఓ యువకుడు ఆమెను ఇష్టపడ్డాడు. కానీ, అందుకు ఆమె ఒప్పుకోలేదు. ఆ యువకుడు గత ఏడాది నవంబర్ లో ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై ఆగ్రహం చెందిన ఆ యువకుడి కుటుంబ సభ్యులు ఆ మహిళను ఇంట్లో నుంచి బయటకు లాగారు. ముగ్గురు బహిరంగంగా గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు.

అక్కడే ఉన్న మహిళలంతా ఆపాల్సిందిపోయి ఆ మగవారిని ప్రోత్సహించారు. సామూహిక అత్యాచారం తర్వాత బాధితురాలికి నిందితులు శిరోముండనం చేశారు.. చితకబాదారు.. మొహానికి నల్ల రంగు పూసి.. మెడలో చెప్పులదండ వేసి వీధులన్నీ తిప్పారు. ఆ వీడియోను చూసిన ఢిల్లీ మహిళా కమిషన్ సీరియస్ అయింది.

20 ఏళ్ల అమ్మాయిపై అక్రమ మద్యం అమ్మకందారులు దారుణానికి తెగబడ్డారని, దీనిపై ఢిల్లీ పోలీసులు 72 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని ఢిల్లీ విమెన్ కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ ఆదేశించారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితులు, వారికి సహకరించిన మహిళలపైనా కేసు నమోదు చేయాలని ఆదేశాలిచ్చారు. ఇంతకుముందు నిందితులపై అక్రమ మద్యం అమ్మకాలు, డ్రగ్స్ కార్యకలాపాలకు సంబంధించిన కేసులనూ తిరగదోడాలని సూచించారు.

More Telugu News