Lightning: పిడుగుపాటుకు 68 ప్రాణాలు బలి

Lightning Strikes Kill 68 in 3 States
షార్ట్స్‌లో చూడండి
పిడుగులు పడి మూడు రాష్ట్రాల్లో 68 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్ లో 41 మంది, రాజస్థాన్ లో 20 మంది, మధ్యప్రదేశ్ లో ఏడుగురిని పిడుగులు కబళించాయి. యూపీలోని ఒక్క ప్రయాగ్ రాజ్ జిల్లాలోనే 14 మంది పిడుగుపాటుతో మరణించారని అధికారులు చెబుతున్నారు. ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోనే పిడుగులు పడ్డాయని, మరణాలూ అక్కడే ఎక్కువగా ఉన్నాయని అన్నారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పరిహారం ప్రకటించారు. పశువులు కోల్పోయిన వారికీ ఆర్థిక సాయం అందేజేస్తామన్నారు.

రాజస్థాన్ రాజధాని జైపూర్ లోని 12వ శతాబ్దం నాటి ఆమిర్ ప్యాలెస్ పై పిడుగు పడింది. ఆ కోటలోని వాచ్ టవర్ పైకి ఎక్కిన పర్యాటకులు పిడుగుపాటుకు గురయ్యారు. దీంతో 11 మంది అక్కడికక్కడే చనిపోయారు. పిడుగుపడిన సమయంలో టవర్ పై 27 మంది దాకా ఉన్నారని, చాలా మంది గాయపడ్డారని అధికారులు చెబుతున్నారు. మొత్తంగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లోనూ పిడుగులు పడ్డాయి. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మధ్యప్రదేశ్ లోని షియోపూర్, గ్వాలియర్, శివపురి జిల్లాల్లో పిడుగుపాటుకు ఏడుగురు మరణించారు.

కాగా, వారి మరణాల పట్ల ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన ప్రధాని.. వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50 వేల ఆర్థిక సాయం చేస్తామన్నారు. ప్రధాన మంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్ నుంచి సాయం అందజేస్తామని చెప్పారు.
Go Back to Shorts
Lightning
Uttar Pradesh
Rajasthan
Madhya Pradesh
Narendra Modi

More Telugu News