Srivarshini: హైదరాబాదులో గోకార్టింగ్ చేస్తూ బీటెక్ విద్యార్థిని మృతి

  • గుర్రంగూడ గోకార్టింగ్ ప్లే జోన్ లో ఘటన
  • టైరులో చిక్కుకున్న విద్యార్థిని తల వెంట్రుకలు
  • నేలకు బలంగా ఢీకొన్న తల
BTech student dies after Go Carting turned into mishap

హైదరాబాదులో ఓ బీటెక్ విద్యార్థిని గోకార్టింగ్ చేసే క్రమంలో తీవ్ర గాయాలపాలై మృత్యువాత పడింది. బీటెక్ ఆఖరి సంవత్సరం చదువున్న శ్రీవర్షిణి అనే విద్యార్థిని స్నేహితులతో కలిసి గుర్రంగూడలో ఉన్న గోకార్టింగ్ ప్లే జోన్ కు వచ్చింది. ఓ యువకుడు గోకార్టింగ్ వాహనం  నడుపుతుండగా, శ్రీవర్షిణి అతడి పక్కనే కూర్చుంది. అయితే ఆ వాహనం ఒక్కసారిగా నియంత్రణ తప్పడంతో శ్రీవర్షిణికి బలమైన దెబ్బలు తగిలాయి.

గోకార్టింగ్ కారు టైరులో శ్రీవర్షిణి తల వెంట్రుకలు చిక్కుకున్నాయి. దాంతో ఆమె తల నేలకు బలంగా ఢీకొంది. ఆ విసురుకు శ్రీవర్షిణి ధరించిన హెల్మెట్ కూడా ముక్కలైందని స్నేహితులు చెబుతున్నారు. కాగా, తీవ్రంగా గాయపడిన శ్రీవర్షిణిని ఆసుపత్రికి తరలించినా ప్రయోజనంలేకపోయింది. ఆమె చికిత్స పొందుతూ మరణించింది.

అయితే, ఈ ఘటన గత అర్ధరాత్రి జరిగినట్టు సమాచారం. అర్ధరాత్రి వేళ గోకార్టింగ్ కు అనుమతి ఇవ్వడంపై శ్రీవర్షిణి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

More Telugu News