వీసా తాజా నిబంధనలపై.. ట్రంప్ సర్కారుపై కోర్టుకెక్కిన చాంబర్ ఆఫ్ కామర్స్!
- వీసా విధానంపై యూఎస్ లో కేసు
- శాన్ ఫ్రాన్సిస్కో ఫెడరల్ కోర్టులో దావా
- అధికార పరిధులను ట్రంప్ దాటుతున్నారని ఆరోపణ
- ఆర్థిక వృద్ధి పడిపోతుందన్న చాంబర్ ఆఫ్ కామర్స్
యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ తో పాటు ది నేషనల్ అసోసియేషన్ ఆఫ్ మాన్యుఫాక్చరర్స్, ది నేషనల్ రిటైల్ ఫెడరేషన్ తదితర వ్యాపార సంఘాలు ఈ పిటిషన్ లో భాగమయ్యాయి. ట్రంప్ నిర్ణయాలు చట్ట విరుద్ధమైనవని, ఇవి స్వాగతించదగినవి కాదని, దేశ ఆర్థిక వ్యవస్థ ముందుకు సాగేందుకు అవసరమైన ఇంజనీర్లు, ఐటీ నిపుణులు, డాక్టర్లు, నర్సులు, ఇతర ముఖ్యమైన రంగాలకు చెందిన వ్యక్తుల రాకను అడ్డగిస్తుందని వారు ఆరోపించారు. ట్రంప్, తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నట్టు చాంబర్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ థామస్ డొనోహూ వ్యాఖ్యానించారు.
ఆర్థిక వ్యవస్థ సాగేందుకు ఉత్పత్తి రంగం అత్యంత కీలకమైందని అభిప్రాయపడ్డ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ మాన్యుఫాక్చరర్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ లిండా కెల్లీ, ఈ తరహా వీసా నిబంధనలతో నిపుణులైన పనివారు ఇతర దేశాలకు వెళ్లిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఆయా దేశాలు అమెరికా వీసా విధానాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటే, యూఎస్ ఎకానమీ దెబ్బతింటుందని అన్నారు. కాగా, ఈ దావాపై హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విభాగంగానీ, శ్వేతసౌధంగానీ ఇంకా స్పందించక పోవడం గమనార్హం.