Facebook: 'ఐ లవ్‌ యూ' అంటూ నెటిజన్ కామెంట్‌.. మండిపడ్డ సినీ నటి అపర్ణ నాయర్

  • అజిత్‌ కుమార్‌ అనే నెటిజన్‌పై విమర్శలు
  • ఇటువంటి వారి ప్రవర్తనను ఉపేక్షించబోను
  • ఓ తండ్రి అయ్యుండి మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు
  • నేను ఓ తండ్రికి కుమార్తెనే
aparna on fb comment

'ఐ లవ్‌ యూ' అంటూ ఓ నెటిజన్ చేసిన కామెంట్‌ పట్ల సామాజిక మాధ్యమాల ద్వారా మలయాళీ నటి అపర్ణా నాయర్ మండిపడింది. అజిత్‌ కుమార్‌ అనే ఆ నెటిజన్‌కు సంబంధించిన ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసి, అతడిని తిట్టింది. తాను కూడా ఒకరికి కూతుర్నేనన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పింది.

తన గురించి తెలుసుకోవాలనుకునే అభిమానులకు అందుబాటులో ఉండేందుకే తాను సోషల్ మీడియాను వాడుతున్నానని చెప్పుకొచ్చింది. అంతేగానీ, ఇటువంటి నెగిటివ్ కామెంట్స్‌ను ప్రోత్సహించడానికి కాదని చెప్పింది. ఒకవేళ తాను ఇటువంటి  కామెంట్లపై స్పందించకపోతే నెటిజన్లు మరోలా అర్థం చేసుకునే అవకాశం ఉందని ఆమె తెలిపింది.

తాను  ఇటువంటి వారి ప్రవర్తనను ఉపేక్షించబోనని మండిపడింది. తనకు ఐ లవ్‌ యూ చెప్పిన అజిత్‌ కుమార్‌ ప్రొఫైల్‌ చెక్‌ చేస్తే అతడికి ఒక కుమార్తె ఉందని అర్థమైందని ఆమె తెలిపింది. అతడు తన కుమార్తెను ప్రేమగా హగ్‌ చేసుకున్న ఓ ఫొటో చూశానని, అదే విధంగా తాను కూడా ప్రేమగా తన హృదయానికి హత్తుకున్న ఓ తండ్రికి కుమార్తెనేనని చెప్పింది. ఇటువంటి వ్యాఖ్యలు చేసేముందు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ఆమె ఘాటుగా పేర్కొంది. ఆమె 2013లో వచ్చిన 'చిన్ని చిన్ని ఆశ' సినిమాతో తెలుగులోనూ ఎంట్రీ ఇచ్చింది.

More Telugu News