Sandalwood: ప్రియుడు మోసం చేశాడని కన్నడ టీవీ నటి చందన ఆత్మహత్య.. పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో!

Sandalwood actress Chandana commits suicide
  • పెళ్లికి నిరాకరించిన ప్రియుడు
  • తన డబ్బు, కెరియర్‌ను అతడి కోసం అర్పించానన్న చందన
  • పరారీలో ఉన్న ప్రియుడి కోసం పోలీసుల గాలింపు
కన్నడ టీవీ నటి చందన (29) ఆత్మహత్య చేసుకుంది. పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి చేరుకున్న ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఆత్మహత్యకు ముందు పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో తీసుకున్న చందన.. ప్రియుడు దినేశ్‌ తనను మోసం చేశాడని విలపించింది. తన డబ్బులు వాడుకున్నాడని, తన కెరియర్‌ను అతడి కోసం అర్పించానని వాపోయింది. ఇంతా చేస్తే అతడు మరో అమ్మాయితో తిరుగుతున్నాడని బోరుమంది.

పోలీసుల కథనం ప్రకారం.. హాసన్ జిల్లా బేలూరుకు చెందిన చందన, దినేశ్‌లు గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుందామన్న చందన ప్రతిపాదనను దినేశ్ తిరస్కరించాడు. దీంతో దినేశ్ కుటుంబ సభ్యుల వద్ద చందన తమ పెళ్లి విషయాన్ని ప్రస్తావించగా వారు అవమానించి పంపించారు. దీంతో తాను మోసపోయానని తెలుసుకున్న చందన నిన్న బెంగళూరులోని తన నివాసంలో పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో తీసుకుంది. అనంతరం దానిని దినేశ్‌కు వాట్సాప్ చేసింది.

వీడియో చూసిన దినేశ్ కంగారు పడి చందన ఇంటికొచ్చాడు. అపస్మారక స్థితిలో పడి ఉన్న చందనను ఆసుపత్రికి తరలించాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగానే చందన ప్రాణాలు కోల్పోయింది. చందన సెల్ఫీ వీడియో ఆధారంగా దినేశ్ కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న దినేశ్ కోసం గాలిస్తున్నారు.
Sandalwood
Bengaluru
Actress
chandana
Suicide

More Telugu News