పంజాబ్​, మధ్యప్రదేశ్ ల్లో రైలు ప్రమాదాలు.. ఐదుగురు మృతి, పలువురికి గాయాలు

Two train accidents in north India 5 dead
ఉత్తర భారతంలో రెండు ఘోర రైలు ప్రమాదాలు జరిగాయి. మధ్యప్రదేశ్ లో రెండు గూడ్స్ రైళ్లు ఎదురెదురుగా ఢీకొనగా.. పంజాబ్ లో ట్రాక్ దాటుతున్న కొందరిని ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదాల్లో ఐదుగురు మరణించగా.. పలువురు గాయపడ్డారు. మధ్యప్రదేశ్ లో సోమవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో రెండు ట్రాక్ లపై బోగీలు పడటంతో భారీగా రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.

రెండు ఎన్టీపీసీకి చెందిన రైళ్లు ఢీకొని..

మధ్యప్రదేశ్ లోని సిలిగురి జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో ఎదురెదురుగా వస్తున్న రెండు గూడ్స్ రైళ్లు బలంగా ఢీకొన్నాయి. ఈ రెండూ కూడా నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ కు చెందిన బొగ్గు తరలించే రైళ్లు అని, ఉత్తరప్రదేశ్ లోని రిషద్ నగర్, మధ్య ప్రదేశ్ లోని అమ్లోరీ మధ్య నడుస్తాయని అధికారులు తెలిపారు.

అందులో ఒక రైలు ఖాళీగా వస్తుండగా.. మరొకటి లోడ్ తీసుకుని వెళ్తోందని అధికారులు చెప్పారు. ఖాళీగా వస్తున్న రైలుకు చెందిన ఇంజన్, పదమూడు బోగీలు పట్టాలు తప్పాయని, కొన్ని పూర్తిగా బోల్తా పడ్డాయని వెల్లడించారు. ఇద్దరు రైలు లోకో పైలట్ల (రైలు నడిపేవారు) తో పాటు మరొకరు మరణించారు.

ట్రాక్ దాటుతుండగా ఢీకొట్టి..

పంజాబ్ లోని లూథియానాలో గ్యాస్ పురా ప్రాంతంలో ట్రాక్ దాటుతున్నవారిని ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయాల పాలయ్యారు. ప్రమాదానికి కారణమైన రైలు ఢిల్లీ నుంచి అమృత్ సర్ వెళ్తోందని అధికారులు తెలిపారు. సోమవారం ఉదయం 8 గంటల సమయంలో గ్యాస్ పురా ప్రాంతంలో రైలు గేటు పడినా కూడా కొందరు ట్రాక్ దాటేందుకు ప్రయత్నించారని, వేగంగా వస్తున్న రైలు వారిని ఢీకొందని చెప్పారు. గాయపడినవారిని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

గేటు వేయకపోవడంతోనే ప్రమాదమన్న బాధితులు

అసలు అక్కడ రైల్వే గేటును మూసేయలేదని, అందువల్లే ప్రమాదం జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. మృతుల్లో ఒకరైన రతన్ జిత్ సింగ్ కుమారుడు దీనిపై మాట్లాడుతూ.. ‘‘మా నాన్న చాలా క్రమశిక్షణతో ఉండే వ్యక్తి. గేటు వేసి ఉంటే ఆయన రైల్వే ట్రాక్ దాటేందుకు ప్రయత్నించేవారే కాదు. గేట్ కీపర్ గేటు వేయకపోవడం వల్లే ప్రమాదం జరిగింది. ఇది రైల్వే నిర్లక్ష్యమే” అని పేర్కొన్నారు.
Go Back to Shorts
India
Panjab
Madhya Pradesh
Train
Train Accident
Goods Train

More Telugu News