తెలుగు రాష్ట్రాలపై కనిపిస్తున్న 'బుల్ బుల్' ప్రభావం!
- తీవ్ర తుపానుగా మారిన బుల్ బుల్
- పూర్తిగా మేఘావృతమైన ఆకాశం
- శనివారం సాయంత్రం తరువాత తీరం దాటే అవకాశం
ప్రస్తుతం బుల్ బుల్ అండమాన్ కు సమీపంలోనే ఉందని, దీని ప్రభావంతో ఇప్పటికే తీర ప్రాంత రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయని, దీని ప్రభావం మరో 72 గంటల వరకూ ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, బెంగాల్ తీరంలో గంటకు 100 కిలోమీటర్ల వరకూ వేగంతో గాలులు వీస్తున్నాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తరాంధ్ర ప్రాంతంలో బుల్ బుల్ ప్రభావం అధికంగా ఉందని విశాఖపట్నం వాతావరణ హెచ్చరికల కేంద్రం పేర్కొంది. శనివారం సాయంత్రం తరువాత పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో ఇది తీరాన్ని దాటవచ్చని అంచనా వేస్తున్నట్టు వెల్లడించింది. తుపాను తన దిశను మార్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయని, ఇది ఒడిశా వైపు పయనిస్తే, చాలా ప్రాంతాల్లో కుంభవృష్టి కురుస్తుందని హెచ్చరించింది.