ఏపీకి పరిశ్రమలు రాకుండా చంద్రబాబు దుష్ప్రచారం చేయిస్తున్నారు!: ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి
- ఇందుకోసం తన మీడియా, సోషల్ మీడియాను వాడుతున్నారు
- వైఎస్ వివేకా హత్య కేసులో త్వరలోనే నిజాలు బయటకు
- తాడేపల్లిలో మీడియాతో వైసీపీ నేత
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు శ్రీనివాసుల రెడ్డి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తమకు తెలియదని శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో లోతుగా విచారణ సాగుతోందనీ, త్వరలోనే అన్ని నిజాలు బయటకు వస్తాయని వ్యాఖ్యానించారు. ఈ కేసులో సమర్థవంతమైన అధికారులు పనిచేస్తున్నారని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతానని తెలిసే చంద్రబాబు రాష్ట్రాన్ని అథోగతి పాలు చేశారని గడికోట విమర్శించారు. అందుకే ఏపీకి పరిశ్రమలు రాకుండా తన మీడియా, సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రెండున్నర లక్షల కోట్ల అప్పులను రాష్ట్రంపై మోపిన చంద్రబాబు, ఏకంగా రూ.లక్ష కోట్ల బిల్లులను పెండింగ్ లో పెట్టి వెళ్లారని ఆరోపించారు. గతంలో ప్రతిపక్షాన్ని విమర్శించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్, చంద్రబాబు చేసిన అవినీతిపై ఎందుకు ట్వీట్లు చేయడం లేదని నిలదీశారు. ఏపీలో అవినీతికి వ్యతిరేకంగా 45 ఏళ్ల వయసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోరాటం చేస్తున్నారని గడికోట శ్రీకాంత్ రెడ్డి కితాబిచ్చారు.